ఏపీలో ఎన్నికల ప్రకటనకు ముందే.. ప్రచార పర్వం దాదాపు ప్రారంభమైపోయింది. ఇప్పటికే టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు రా..కదలిరా! సభను రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఆయన ఈ సభలు పెడుతూ.. పార్టీపరంగా నాయకులను నడిపిస్తున్నారు. ఇదేసమయంలో అభ్యర్థుల ఎంపికపైనా.. ఆయన దృష్టి పెట్టారు. అంటే దాదాపు రా..కదలిరా! సభ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక, ఇప్పటి వరకు వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నేరుగా చేపట్టలేదు. ఎక్కడైనా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే.. ఆయా సభల్లో జగన్ ప్రసంగిస్తున్నారు. విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. కానీ, ప్రత్యేకంగా ఎన్నికల కోసం.. ఇప్పటి వరకు సభ పెట్టలేదు. కానీ, తాజాగా శనివారం నుంచి వైసీపీ కూడా రెడీ అయిపోయింది. మేం వచ్చే ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని చెబుతూ.. అదే పేరు(సిద్ధం)తో సభ నిర్వహిస్తోంది.
విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం శివారులో దాదాపు 14 ఎకరాల స్థలంలో భారీ ఎత్తున సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు 3 లక్షల మంది ప్రజలను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకు న్నారు. గతంలో టీడీపీ నేత నారా లోకేష్ చేసిన ‘యువగళం’ పాదయాత్ర ముగింపు సందర్భంగా.. ఇదే జిల్లాలోభారీ సభను నిర్వహించింది. దీనిని ఎన్నికల శంఖారావంగా చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో ఇక్కడే వైసీపీ కూడా ప్లాన్ చేసింది. శనివారం ఈ సభను విజయవంతం చేసేందుకు పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతోంది.
మరోవైపు శనివారం నుంచి నిర్విరామంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జనంలోకే వస్తున్నారు. వరుసగా ఆయన రోజుకు రెండు సభలు పెట్టడం ద్వారా.. ఎన్నికల ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పీలేరు, పత్తికొండ, నెల్లూరు, రాజమండ్రి రూరల్ ఇలా.. వరుసగా చంద్రబాబు కూడా.. సభలకు హాజరు కానున్నారు. వైసీపీ శనివారం నుంచి వరుసగా సభలకు ప్లాన్ చేస్తుండడంతో మొత్తంగా ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని తెలుస్తోంది.