తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల కోసమని వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకోవటమే టార్గెట్ గా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ తదితరులతో రేవంత్, సునీల్ కనుగోలు రెండుసార్లు భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో తాను చేయాల్సిన పనులను, చేయబోతున్న సర్వేలను సునీల్ వివరించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. దానికి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కష్టం చాలానే ఉంది. దాదాపు ఏడాదికి ముందునుండే ప్రతి నియోజకవర్గంలోను సర్వేలు చేయటం, కేసీయార్ పాలనపై నెగిటివ్ క్యాంపెయిన్ చేయటం, సోషల్ మీడియాలో కాంగ్రెస్ అనుకూల ప్రచారం+బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారాన్ని ఏకకాలంలో సునీల్ నడిపించారు. ఆశావహుల వడపోత, అభ్యర్ధులుగా ఎంపిక తదితరాల్లో సునీల్ చాలా కష్టపడ్డారు. అభ్యర్ధులుగా ఎంపిక చేసి బీఫారాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఆపేసి వేరే వాళ్ళని ఎంపిక చేసి బీఫారాలు ఇచ్చింది పార్టీ.
చివరి నిముషంలో అభ్యర్థుల మార్పుల్లో కూడా సునీల్ సర్వేలే కీలకమయ్యాయి. అందుకనే సునీల్ అంటే కాంగ్రెస్ కు బాగా గురి కుదిరింది. కాబట్టే పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించటం కోసం సునీల్ ను దింపేసింది. సునీల్ కూడా తన బృందాలతో నియోజకవర్గాల్లో పని మొదలు పెట్టేశారట. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన, ప్రజాదర్బార్ నిర్వహణ, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను కలవటం, ఇచ్చిన హామీలను అమల్లోకి తేవటం, సచివాలయంలోకి మామూలు జనాల ఎంట్రీ లాంటి అనేక అంశాలను సోషల్ మీడియా ద్వారా సునీల్ ప్రచారంలోకి తేబోతున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో కేసీయార్ హయాంలో జరిగిన కాళేశ్వరం, మేడిగడ్డ, సీతారామ ప్రాజెక్టుల అవినీతి, ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలు తదితరాలను వ్యూహకర్త బృందం బాగా హైలైట్ చేయబోతోంది. ఏదేమైనా పార్లమెంటు ఎన్నికల వేదికగా మళ్ళీ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య మరోసారి బిగ్ ఫైట్ ఖాయమని తేలిపోయింది. ఎందుకంటే ఇటువంటి వ్యూహాలతోనే బీఆర్ఎస్ కూడా రెడీ అవుతుంది కాబట్టే. మరి జనాలు ఎవరి ప్రచారాన్ని నమ్ముతారో, ఎవరికి మద్దతిస్తారో చూడాలి.