ఆ రెండు స్థానాలూ మావే.. : ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి తాము పోటీ చేయ‌నున్న రెండు స్థానాల‌ను ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌న‌సేన పొత్తులో బాగంగా రాష్ట్రంలో పోటీ చేస్తామ‌ని మాత్ర‌మే చెప్పుకొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా.. రెండు కీల‌క నియోజ‌క వ‌ర్గాల పేర్ల‌ను వెల్ల‌డించ‌డం.. జ‌న‌సేన‌లో ఉత్సాహాన్ని నింపింది. వాస్త‌వానికి కొన్ని రోజులుగా జ‌న‌సేన పోటీ చేసే స్థానాల విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల ఏకంగా 63 స్థానాలు ఇస్తున్న‌ట్టు టీడీపీ ప్ర‌క‌టించింద‌నే న‌కిలీ ప్ర‌క‌ట‌న ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసింది. దీనిపై విమ‌ర్శ‌లు.. పెద‌వి విరుపులు కూడా వ‌చ్చాయి. మ‌రోవైపు జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కుల్లోనూ ఎన్ని సీట్లు ఎవ‌రికి? అనే చ‌ర్చ సాగింది. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాము ఓ రెండు స్థానాల నుంచి ఖ‌చ్చితంగా పోటీ చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. రాజోలు(తూర్పు గోదావ‌రి జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాదించింది) సీటును ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

అదేవిధంగా.. రాజాన‌గ‌రం( తూర్పుగోదావ‌రి జిల్లాలోని జ‌న‌ర‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గం) నుంచి తాము పోటీ చేయ‌ను న్న‌ట్టు తెలిపారు. టికెట్ల ఖ‌రారు ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని.. టీడీపీ రెండు స్థానాలు ప్ర‌క‌టించినందున తాను కూడా రెండు స్థానాలు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. ఇక‌, పొత్తులను దెబ్బ‌తీసేలా కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని.. వీటిని జ‌న‌సేన నాయ‌కులు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ప‌వ‌న్ చెప్పారు. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న రిప‌బ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

వ‌చ్చేయండి నేనున్నా..

ఇదిలావుంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ ఆఫ‌ర్ ఇచ్చారు. అది కూడా వైసీపీ నాయ‌కుల‌కు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. “వైసీపీలో ఇబ్బందులు ఉంటే నాద‌గ్గ‌ర‌కు వ‌చ్చేయండి నేను చూసుకుంటా” అని ఆయ‌న పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల మ‌చిలీపట్నం ఎంపీ బాల‌శౌరి త‌న ప‌ద‌వికి, వైసీపీకి రాజీనామా చేసి.. జ‌న‌సేన‌లో చేరిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఎమ్మెల్సీ వంశీ కృష్ణ కూడా ఇలానే జ‌న‌సేన‌లో చేరారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.