ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన దివంగత వైఎస్ తనయ వైఎస్ షర్మిల.. తన పోరాటం ఎవరి మీదో చెప్పకనే చెప్పేశారు. ఒక దశలో నేరుగా తన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, రాష్ట్రంలో అదికారంలోకి తీసుకురావడమేనన్నారు. మరోవైపు.. తన అన్న జగన్ సర్కారుపై యుద్ధం ప్రకటిస్తానన్నారు. మొత్తంగా ఏపీపై తన వ్యూహాన్ని షర్మిల వెల్లడించారు. ఇప్పుడు దీనికి అనుసంధానంగా ఆమె జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు.
షర్మిల అన్ని జిల్లాల పర్యటనల్లో షర్మిల పాతనాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంతోపాటు.. కాంగ్రెస్ లక్ష్యాలను ఆమె వివరించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. అదేవిధంగా తన రాజకీయ వ్యూహాలు.. తాను కాంగ్రెస్ పగ్గాలు ఎందుకు తీసుకున్నదీ ఆమె వివరించనున్నారు. మరీ ముఖ్యంగా పార్టీని డెవలప్ చేసేలా ఆమె ముందుకు సాగే అవకాశం ఉంది.
ఎవరెవరు వస్తారు..
షర్మిల జిల్లాల పర్యటనలో కీలకమైన అంశం.. పాత కాంగ్రెస్ నేతలను తిరిగి యాక్టివ్ చేయడం. వాస్తవానికి పార్టీకి పాతకాపులు చాలా మంది ఉన్నప్పటికీ ఇప్పుడు వారంతా రాజకీయాలకు చాలా మంది దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు కూడా.. వివిధ పార్టీల్లో ఉన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజు కుంటుందన్న పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ పుంజుకుంటేనే తప్ప కదలని నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీలను బలంగా ఢీకొట్టే పరిస్థితిపైనా అంచనా వేస్తున్నారు. ఇది తేలితే తప్ప.. ఎవరూ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
మరోవైపు.. ఇప్పుడే.. కాంగ్రెస్‌లోకి వస్తే.. చేతి చమురు వదలడం తప్ప.. పార్టీ పరంగా, రాజకీయంగా కూడా ఇప్పటికిప్పుడు తమకు ఒనగూరే ప్రయోజనం కూడా లేదనే భావన చాలా మంది నాయకుల్లో ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే.. అధికార పార్టీ, లేదా ప్రతిపక్షాలను కాదని ఏమీలేని కాంగ్రెస్ వైపు వెళ్లినా.. తమకు ఇబ్బందేనని భావిస్తున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. సో.. మొత్తంగా ఎలా చూసుకున్నా.. షర్మిల తనను తాను నిరూపించుకునే వరకు కూడా.. పాతకాపులు వచ్చే అవకాశం పార్టీ పుంజుకునే ఛాన్స్ కూడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.జిల్లాల వారీగా షర్మిల ఫోకస్.. అసలు టెస్ట్ ఇదే..!