వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు కనీసం కాంగ్రెస్ పేరు కూడా పలకని ఆయన ఇప్పుడు ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గతం కూడా తవ్వుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేయడంలో ముందుందని అన్నారు. ప్రస్తుతం తమ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని జగన్ విమర్శలు గుప్పించారు. మంగళవారం తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు.
వేదికపై ఆయన ప్రసంగిస్తూ.. అనూహ్యంగా కాంగ్రెస్ అంశాన్ని ప్రస్తావించారు. విభజించి పాలించు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వారు లేరన్నారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని అన్నారు. “కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించింది. ఏపీ ప్రజలు ఎంత మొత్తుకున్నా.. ఏమాత్రం వినిపించుకోలేదు. విభజన చేసి తీరాలని భావించి అదే పనిచేసింది. ఆ తర్వాత.. నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేశాక.. మా కుటుంబంలో తొలిసారి విభజన తీసుకువచ్చింది. మా చిన్నాన్న(వైఎస్ వివేకానందరెడ్డి)ను మాకు దూరం చేసి.. మాపైనే ఉసిగొల్పింది” అని జగన్ చెప్పారు.
అంతేకాదు.. వివేకాను తమపైనే పోటీకి పెట్టి.. తమపైనే విమర్శలు చేయించిందని జగన్ అన్నారు. ఇప్పుడు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఇదే పనిచేస్తోందని.. పరోక్షంగా తన సోదరి షర్మిలకు కాంగ్రెస్ ఏపీ పగ్గాలు అప్పగించడాన్ని ఆయన ప్రస్తావించారు. విబజించి పాలించే నైజం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఆ దేవుడే గుణపాఠం నేర్పుతాడని వ్యాఖ్యానించారు. తాము ప్రజలను నమ్ముకున్నామని జగన్ చెప్పారు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో అమలు కాని అనేక సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా వాటి వివరాలను.. ప్రజల ఖాతాల్లో వేస్తున్న నిధుల వివరాలను కూడా జగన్ వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates