జ‌న‌సేన‌కు గ్లాస్ గుర్తే.. ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు

ఏపీలో కీల‌క పార్టీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి “గాజు గ్లాసు”ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల స‌మయంలో జ‌న‌సేన గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది.

అయితే.. ఆ పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. దీంతో గుర్తింపు లేని పార్టీగానే జ‌న‌సేన కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి పార్టీలకు శాస్వ‌తంగా గుర్తుల కేటాయింపు ఉండ‌దు. దీంతో గ‌త ఏడాది జ‌రిగిన‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు వివాదంగా మారింది. ఎన్నిక‌ల పోలింగ్ చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా ఈ సందేహాలు.. ఊగిస‌లాడాయి. మ‌రోవైపు.. ఇది రాజ‌కీయంగా కూడా ఇర‌కాటంలోకి నెట్టింది. అయితే..ఎట్ట‌కేల‌కు అప్ప‌ట్లో ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో తెలంగాణలో జ‌న‌సేన అభ్య‌ర్తులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు.

ఇక‌, ఇప్పుడు త్వ‌ర‌లోనే ఏపీ అసెంబ్లీ తో పాటుపార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. దీంతో జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో గుర్తు విష‌యంపై పార్టీ నాయ‌కులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు సంధించారు. వీటిని ప‌రిశీలించిన సంఘం. ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేనకు కేటాయిస్తూ.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌న‌సేన‌ అభ్యర్ధులు గ్లాసు గుర్తుతోనే ఎన్నికల బరిలో నిలవనున్నారు.