ఇండియా కూటమికి దీదీ గుడ్ బై

2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ను ఈ సారి ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. అయితే, ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి అందులోని పార్టీల మధ్య ఐకమత్యం లోపించిందని విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ…ఇండియా కూటమికి అంటిముట్టునట్లు ఉంటున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా ఇండియా కూటమికి దీదీ గుడ్ బై చెప్పేశారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే, ఫలితాల తర్వాతే కాంగ్రెస్ తో పొత్తును పరిశీలిస్తామని దీదీ ప్రకటించారు. కాంగ్రెస్ తో తాను ఎటువంటి చర్చలు జరపలేదని, ఒంటరి పోరు చేస్తానని తాను గతంలో కూడా చెప్పానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిపాదనలు చేశానని, కానీ, అన్నింటినీ వారు తిరస్కరించారని చెప్పారు. తమది లౌకిక పార్టీ అని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో న్యాయ యాత్ర బెంగాల్ లో ప్రవేశించబోతోందని, ప్రతిపక్ష కూటమిలో ఉన్న తనకు ఆ యాత్ర పై సమాచారం ఇవ్వాలన్న కనీస మర్యాద కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే, బెంగాల్ కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదలచుకోలేదని క్లారిటీనిచ్చారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఇబ్బంది లేదని, కానీ బెంగాల్ లో మాత్రం టీఎంసీ ఒంటరిగానే పోరాడుతుందని చెప్పారు. బెంగాల్ లో బీజేపీకి బుద్ధి చెప్పగలిగిన సత్తా ఉన్న పార్టీ టీఎంసీ మాత్రమేనని అన్నారు. మరి దీదీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి బలమైన టిఎంసి దూరం కావడంతో ఆ కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.