సీఎం రేవంత్ తో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల భేటీ..

తెలంగాణ రాజ‌కీయాల్లో అత్యంత ఆస‌క్తికర ఘ‌ట్టం చోటు చేసుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌త్తులు నూరుకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయ‌కులు ఒకే చోట చేర‌డం.. అందునా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోయి పోయి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావ‌డం.. ఎవ‌రూ ఊహించి కూడా ఉండ‌రు. కానీ, నిజంగానే జ‌రిగింది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌ను త‌న నివాసంలో క‌లిసిన న‌లుగురు ఎమ్మెల్యేలు.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినందున అభినంద‌న‌లు తెలిపామ‌న్నారు.

సీఎం రేవంత్‌ను క‌లిసిన వారిలో న‌ర‌సాపూర్ ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ప‌టాన్ చెరు ఎమ్మెల్యే మ‌హిపాల్‌రెడ్డి, జ‌హీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఉన్నారు. వీరు వ‌స్తున్నార‌న్న విష‌యం ముందుగానే తెలుసుకున్న రేవంత్‌రెడ్డి.. సాద‌రంగా వారిని ఆయ‌న ఆహ్వానించారు. పుష్ప‌గుచ్చాలు స్వీక‌రించి.. సంతోష ప‌రిచారు. అనంత‌రం బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ తేనీటి విందు ఇచ్చారు. అయితే.. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. కానీ, దీనికి అంత ప్రాధాన్యం లేద‌ని, మ‌ర్యాద పూర్వ‌కంగానే తాము సీఎం రేవంత్ను క‌లిసామ‌ని.. వారు చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను చూసేందుకు, క‌నీసం వారితో మాట్లాడేందుకు.. వారి వ‌స్తున్నారంటే.. ఆ దారిలో వెళ్లేందుకు కూడా నాయ‌కులు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థిత్వం అంటే.. కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిమితం అయ్యేది. త‌ర్వాత‌.. నాయ‌కులు క‌లివిడిగానే ఉండేవారు. బంధుత్వాలు కూడా ఉన్న‌వారు ఉన్నారు. కానీ, రాను రాను ప్రాంతీయ పార్టీల హ‌వా పెరిగిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు అంటే.. దూష‌ణ‌లు, విమ‌ర్శ‌లు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా తెర‌మీదికి తీసుకురావ‌డం వంటివిగా త‌యారై.. అస‌లు ప్ర‌త్య‌ర్థులు ఒక‌రి ముఖం ఒక‌రు చూసుకోలేనంత‌గా మారిపోయింది.

తెలంగాణ‌లో అయినా.. ఏపీలో ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంది. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీస్తూ.. త‌న‌ను క‌లుసుకోవాలని, అభినందించాల‌ని భావించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం, వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌డం.. వారితో క‌లిసి పొటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం వంటివి మారుతున్న‌రాజ‌కీయాలు నాంది అనే మాట వినిపిస్తోంది. రాజ‌కీయాలు అంటే.. రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావాల‌న్న మేధావుల సూచ‌న అమ‌ల‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.