బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో మంగళవారం నుండి పర్యటనలు మొదలుపెట్టారు. 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆమె షెడ్యూల్ కూడా ఇప్పటికే అన్నీ జిల్లాలోని ముఖ్యనేతలు, క్యాడర్ కు అందాయి. దాని ప్రకారమే మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉత్థానం మండలంలోని కిడ్నీ బాధితులతో పాటు పొందూరు చేనేత కార్మికులతోను భేటీ అవుతున్నారు.
24వ తేదీన విశాఖపట్నం సిటీ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తో భేటీ కాబోతున్నారు. తర్వాత అనకాపల్లి జిల్లాలో మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణతో కూడా షర్మిల భేటీ కాబోతున్నారు. కొణతాల ఈమధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. కొణతాల తొందరలోనే జనసేనలో చేరబోతున్నట్లు స్వయంగా పవనే ప్రకటించారు. అలాంటిది ఇపుడు కొణతాలతో షర్మిల భేటీ అవబోతుండటం ఆసక్తిగా మారింది.
అలాగే ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఉండవల్లితో షర్మిల భర్త బ్రదర్ అనీల్ సమావేశమైన విషయం తెలిసిందే. రాయలసీమ జిల్లాల పర్యటనలో అనంతపురంలో పర్యటించేటపుడు రాయదుర్గం వైసీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డితో భేటీ కాబోతున్నారు. ఎంఎల్ఏ కాంగ్రెస్ లో చేరే అవకాశముంది.
అలాగే కర్నూలు పర్యటనలో వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తో కూడా షర్మిల భేటీ కాబోతున్నారు. ఈ ఎంపీని కూడా పార్టీలోకి షర్మిల ఆహ్వానిస్తున్నారు. 31వ తేదీన ఇడుపులపాయకు చేరుకోవటంతో షర్మిల సుడిగాలి పర్యటన పూర్తవుతుంది. తన పర్యటనలో ముఖ్యంగా కాంగ్రెస్ పాత కాపులను మళ్ళీ యాక్టివ్ చేయటం, వైసీపీ నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవటమే అజెండాగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి షర్మిల ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.