సరే జగన్ అన్నగారూ అనే అందాము: ష‌ర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ త‌న‌య‌.. వైఎస్ ష‌ర్మిల అప్పుడే ప‌ని ప్రారంభించేశారు. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌కు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంభించిన ష‌ర్మిల ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని కీల‌క‌మైన శ్రీకాకుళం నుంచి త‌న యాత్ర‌ను ప్రారంభించారు. జిల్లాలోని పలాస నియోజ‌క‌వ‌ర్గం లో ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిల ఇచ్ఛాపురం వ‌ర‌కు బ‌స్సులోనే ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌యాణికుల‌తో ముచ్చ‌టించారు.

మ‌హిళా ప్ర‌యాణికుల ప‌క్క‌నే కూర్చున్న ష‌ర్మిల.. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వెనుక‌బ‌డిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ప‌రిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో వారికి జ‌రుగుతున్న ప్ర‌యోజ‌నం వంటి వాటిని ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల బ‌స్సులోనే మీడియాతో మాట్లాడారు. ఈ స‌మ‌యంలో కొన్నాళ్ల కింద‌ట వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(ష‌ర్మిల‌కు సొంత‌ చిన్నాన్న‌) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె స్పందించారు.

రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని, ఎక్క‌డ చూసినా.. స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయ‌ని ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌మ‌యంలో ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌ల‌పై వైవీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. త‌మ ప్ర‌భుత్వం ఎంతో అభివృద్ధి చేసింద‌ని, ఎవ‌రు వ‌చ్చినా అభివృద్ది చూపిస్తామ‌ని అన్నారు. అలాగే, ష‌ర్మిల సీఎం ను ఉద్దేశించి జ‌గ‌న్‌రెడ్డి అని సంబోధించ‌డాన్ని కూడా వైవీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ష‌ర్మిల స్పందిస్తూ.. “సుబ్బారెడ్డి గారు. .జగన్ రెడ్డిగారు అనటం న‌చ్చ‌లేదంటున్నారు. సరే జగన్ అన్నగారూ అనే అందాము” అని వ్యాఖ్యానించారు.

అదేస‌మ‌యంలో అభివృద్ధిని చూపిస్తామ‌న్న వైవీ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. “వైవీ సుబ్బారెడ్డి గారు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. మేము చూడటానికి సిద్దంగా ఉన్నాం. టైం,డేట్ మీరు చెప్పిన సరే,మమ్మల్ని చెప్పమన్నా సరే రెడీ. మీరు చేసిన అభివృద్ధి చూసేందుకు మేమే కాదు, మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా వస్తారు. మీరు చేపట్టిన అభివృద్ధి, మీరు నిర్మించిన రాజధాని ఎక్క‌డ‌, మీరు క‌ట్టిన పోలవరం ఎక్క‌డ‌? మీరు నడుపుతున్న మెట్రో ఎక్క‌డో చూపించండి. చూడటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాం. చూపించండి“ అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. దీనిపై వైవీ ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి.