ఏపీలో జన రంజక పాలన సాగుతోందని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న రోజుల్లోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం తమదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లుతోందని, ప్రజా సంక్షేమ పథకాలకు టీడీపీ అడ్డుపడుతోందని విమర్శిస్తున్నారు.
చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి మరోసారి ఘోర పరాభవం తప్పదని మంత్రి కొడాలి నాని అన్నారు. మరోవైపు, 15 నెలల వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
గంటకు రూ.9 కోట్లు అప్పు చేస్తూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ఎన్నికలు రావడం ఖాయమని, ఏ క్షణంలో ఎన్నికలు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు.
ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని అడ్డుకుంటామని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల పొలాల్లోని మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. స్మార్ట్ మీటర్ల వల్ల మెట్ట ప్రాంత, రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
జగన్ అసమర్థ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. 15 నెలల పాలనలో జగన్ ప్రభుత్వం రెండుసార్లు కరెంటు ఛార్జీలను పెంచింని, ఈ పథకంతో 18 లక్షల రైతుల జీవితాలతో చెలగాటమాడాలనుకుంటోందని మండిపడ్డారు.
తన హయాంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని, వైసీపీ చెప్పేదొకటి చేసేదొకటి అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఇపుడు జగన్ పాలనలో అడ్రస్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.