ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నాయకుడు, వివాద రహితుడు, గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీల జాబితా మూడుకు చేరింది. ఇప్పటి వరకు కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్.. తనకు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో పార్టీ కి గుడ్ బై చెప్పారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.
అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన నేరుగా జనసేనలో కి వెళ్తున్నట్టు ప్రకటనే చేశారు. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం కాకుండా.. నరసరావుపేట నుంచి బాలశౌరిని పోటీ చేయాలని పార్టీ కోరింది. ఈ నేపథ్యంలో బాలశౌరి పార్టీని వీడిపోయారు. ఇక, ఇప్పుడు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ఈయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది.
కానీ, తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని లావు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఈయనను వెయిటింగ్‌లో పెట్టింది. ఇంతలోనే.. లావు స్థానంలో కొత్తవారిని తీసుకువస్తున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నే తాజాగా లావు గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అనిశ్చితి ఏర్పడిందని.. ఇది మంచిది కాదని.. అందుకే తాను బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా తన నియోజకవర్గంలోకొత్తవారిని తీసుకువస్తున్నారన్న ప్రచారం జరుగుతోందని లావు అన్నారు. దీంతో ఇప్పటి వరకు తనకు అండగా ఉన్న కేడర్.. గందరగోళంలో చిక్కుకున్నారని.. వారి కోసమే తాను పార్టీకి రిజైన్ చేశానని వ్యాఖ్యానించారు. అయితే.. ప్రస్తుతంఅనిశ్చితికి తాను కారణం కాదని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, లావుకే టికెట్ ఇవ్వాలని.. ఇక్కడి వైసీపీ ఎంపీలు.. చాలా మంది వైసీపీకి సూచించారు. కానీ, పార్టీ మాత్రం ఆయనను మార్చాలని పట్టుదలతో ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates