రాజకీయాల్లో రామమందిరం చేరిపోయింది. త్వరలోనే జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత అయో ధ్య రామమందిర ప్రతిష్టా పనులు.. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు.. పడిన కష్టం వంటివి ప్రత్యేకంగా చర్చనీయాంశం కానున్నాయి. మెజారిటీ హిందువులు ఉన్న భారత దేశంలో వారి సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా.. ఎన్నికల్లో లబ్ది పొందాలనేది ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ వ్యూహం. అందుకే.. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించడం.. అహరహం.. ప్రధాని మోడీ దీనిని పర్యవేక్షించడం వంటివి జరిగాయి.
అయితే.. ఇలా అయోధ్యను రాజకీయాల్లో వాడుకోవడం.. ఎన్నికల్లో లబ్ధి పొందడం అనేది ఇప్పుడు కొత్తకాదు. 1990లలోనే అయోధ్య రాజకీయ వస్తువుగా మారిపోయింది. అప్పట్లో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి లాల్ కిషన్ అద్వానీ.. దీనిని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతి హిందువు ఇంటిపై జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. అయోధ్య రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అరెస్టులు.. లాఠీ చార్జీలకు సైతం వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.
అనుకున్నట్టుగానే రథ యాత్ర చేశారు. ఇది కాస్తా.. ఎన్నికల యాత్రగా మారి.. 1990లలోనే బీజేపీ అధికా రంలోకి వచ్చేందుకు అవకాశం కల్పించింది. 547 మంది సభ్యులు ఉన్న భారత పార్లమెంటులో అప్పటి వరకు కేవలం బిక్కుబిక్కు మంటూ ఇద్దరు సభ్యులతో ఉన్న బీజేపీ.. అనూహ్యంగా 303 స్థానాల్లో విజయం దక్కించుకుని తిరుగులేని అధికారాన్ని చేపట్టింది. దీనికి ప్రధాన కారణం.. ప్రధాన సాక్షి.. రామ మందిర మే! ఈ విషయాన్ని అద్వానీ పలు సందర్భాల్లోనూ వెల్లడించారు.
ఇక, ఇప్పుడు పరిస్థితి దానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. పైగా మరింత లక్ష్యం ఏర్పాటు చేసుకుని బీజేపీ నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు.. ఇప్పుడు దేశాన్ని,రాష్ట్రాలను రామనామ జపంలో ముంచేయడంలో ప్రధాని నరేంద్రమోడీ పూర్తిగా సక్సెస్ అయ్యారనడంలో సందేశం లేదు. ఇక, వచ్చే రెండు మాసాల్లో.. జరగనున్న ఎన్నికల్లో ఈ అయోధ్య రామమందిరం తమకు 400 సీట్లకు పైగానే తీసుకువస్తుందని మోడీ అంచనా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 2014 నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న మోడీకి ఇప్పుడు అయోధ్య రామమందిరం రూపంలో మూడో సారి కూడా విజయం దక్కడం ఖాయమనే అంచనాలు వస్తుండడం గమనార్హం. మొత్తానికి రామ మందిరం సాక్షిగా.. నాడు 300 ల సీట్లు వస్తే.. నేడు 400లకుపైగా టార్గెట్ పెట్టుకోవడం మరింత విశేషం!!