ఉత్తరాంధ్రలో పట్టున్న నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. తాను త్వరలోనే జనసేనలో చేరనున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రెండు పార్లమెంటు.. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సంబందించి ఆయన ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అదేసమయంలో ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా తీసుకునేందుకు తాను సిద్ధమేనని వెల్లడించారు.
ఈ పరిణామం.. వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకప్పుడు కాంగ్రెస్కు నేతృత్వం వహించిన కొణతాల రామకృష్ణ.. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. పార్టీని అన్ని విధాలా డెవలప్ చేశారు. తర్వాత.. టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ మరింత ఎక్కువగా ఆయన పాటుపడ్డారనే చెప్పాలి. బలమైన కేడర్‌ను సిద్ధం చేయడంతోపాటు.. టీడీపీ నిలదొక్కుకునే వ్యూహాలతో ముందుకు సాగారు. ఫలితంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ చాలా బలంగా ఎదిగింది.
అయితే.. టీడీపీతో విభేదించిన కొణతాల.. వైసీపీలోనూ పనిచేశారు. అయితే, జగన్‌కు ఆయనకు సరిపడక.. బయటకు వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు మరోసారి కూడా.. పార్టీలో చేరాలని అనుకు న్నా.. “జగన్‌లో మార్పు రాలేదు” అంటూ.. మరోసారి బయటకు వచ్చారు. తాజాగా జనసేనతో కలిసారు. రేపోమాపో ఆయన జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే టీడీపీ-జనసేన మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో కొణతాల రాజకీయం నల్లేరుపైనడకే అన్నట్టుగా సాగనుంది.
ఫలితంగా.. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ వైసీపీకి ఇబ్బందులు తప్పేలా లేవని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి కొన్నాళ్లుగా వైసీపీ ఉత్తరాంధ్రపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. బొత్స సత్యనారాయణ సహా వైవీ సుబ్బారెడ్డి వంటి వారికి జిల్లాల బాధ్యతలను కూడా అప్పగించింది. అయితే.. నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్న కొణతాల ఎంట్రీతో ఈ ప్రయోగాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యమంతో జిల్లాల్లో ఉన్న సమస్యలపై సుదీర్ఘ కాలంగా కొణతాల ఉద్యమించారు. ఇది ఆయన ప్లస్‌కానుంది. ఆయన ఎటు వుంటే.. అటు.. ప్రజలు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామమే వైసీపీలో కలవరం పుట్టిస్తోందని అంటున్నారు పరిశీలకులు.