వైసీపీకి భారీ షాక్‌: కోన‌సీమలో 40 వేల ఓట్లకు గండి

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ ప్రాంతానికి (ప్ర‌స్తుతం కోన‌సీమ జిల్లా) చెందిన శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా ప్ర‌క‌టించారు. త‌న‌తోపాటు.. 20 నుంచి 30 వేల మంది శెట్టిబ‌లిజ నాయ‌కులు ఆ పార్టీ నుంచి బ‌య‌టకు వ‌స్తార‌ని ఆయ‌న తెలిపారు. వాస్త‌వానికి శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గం కోన‌సీమ‌లో బ‌ల‌మైన పాత్ర పోషిస్తోంది.

దాదాపు 40 వేల నుంచి 50 వేల మ‌ధ్య ఓటు బ్యాంకు ఉన్న శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గం కాపు సామాజిక వ‌ర్గంలో ఒక తెగ‌గా ఉన్నారు. ఇక‌, వాసంశెట్టి సుభాష్‌.. శెట్టిబ‌లిజ యాక్ష‌న్ ఫోర్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసుకుని.. ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌యోజ‌నాల‌కు అనుకూలంగా ప‌నిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయ‌న వైసీపీలోనే ఉన్నారు. అయితే.. జిల్లా పేరు మార్పు నుంచి(కోనసీమ జిల్లాను డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మారుస్తూ) ఆయ‌న పార్టీతో విభేదిస్తున్నారు.

అంతేకాదు.. జిల్లా పేరు మార్పు విష‌యంలో జ‌రిగిన భారీ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల్లో ఈ సామాజిక వ‌ర్గం పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఆయా కేసుల‌ను ఎత్తివేసింది. అయిన‌ప్ప‌టికీ.. స్థానికంగా ఉన్న రాజ‌కీయ నేత‌లు.. త‌మ‌తో క‌లివిడిగా ఉండ‌డం లేద‌ని.. కులాల‌మ‌ధ్య చిచ్చు పెడుతున్నార‌ని.. దీనిని నివారించేందుకు అలాంటి నాయ‌కుల‌కు టికెట్ ఇవ్వరాద‌ని.. కొన్నాళ్లుగా వాసంశెట్టి డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల వైసీపీ ప్ర‌భుత్వ‌ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌రామ‌కృష్ణారెడ్డికి వివ‌రించారు. అయినా.. ప్ర‌భుత్వం మాత్రం వీరి డిమాండ్‌ను ప‌ట్టించుకోలేద‌న్న‌ది వాసంశెట్టి ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలోనే ఇక‌, పార్టీలో ఇమ‌డ‌లేక‌.. బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ ఎఫెక్ట్‌తో సుమారు 40 వేల నుంచి 50 వేల శెట్టిబ‌లిజ ఓట్లు వైసీపీకి దూర‌మ‌వుతాయ‌నే అంచ‌నా ఉంది. వీరంతా ఒకే మాట‌పై ఉంటార‌ని తెలిసిందే. త్వ‌ర‌లోనే వాసంశెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకుంటాన‌ని చెప్పారు.