విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి చంద్రబాబు బాలకృష్ణ తదితరులు అన్నగారికి నివాళులర్పించారు. అయితే, అంతకుముందు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలుకుతూ అక్కడ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమానులు భారీ సైజులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ చెప్పడం సంచలనం రేపుతోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీసివేయాలని బాలకృష్ణ తన అనుచరులకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అరెస్టు సమయంలో, అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో కూడా తారక్, కళ్యాణ్ రామ్ లు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే నందమూరి, నారా కుటుంబాలతో ఆ ఇద్దరికి చాలాకాలంగా గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది.
అందుకే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే తీయించేయ్… అంటూ ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని బాలకృష్ణ చెప్పిన వీడియో వైరల్ గా మారింది. బాలకృష్ణ చెప్పిన వెంటనే తారక్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను బాలయ్య బాబు అనుచరులు తొలగించారు. యమదొంగ చిత్రంలో యమధర్మరాజు గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోతో పాటు, అన్న నందమూరి తారక రామారావు ఫొటోను కలిపి ఫ్లెక్సీలు అభిమానులు వేయించారు. వాటిని తొలగిస్తున్న వీడియో వ్యవహారంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందన ఏవిధంగా ఉంటుందని ఆసక్తికరంగా మారింది.