తొందరలో జరగబోయే ఎన్నికల్లో జనాలకు కాంగ్రెస్ పార్టీ గాలమేస్తున్నట్లే ఉంది. విచిత్రం ఏమిటంటే ఏపీ జనాలకు తెలంగాణా కాంగ్రెస్ గాలమేస్తుండటం. ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణాలో ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జరగాల్సింది పార్లమెంటు ఎన్నికలు మాత్రమే. అదే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాలి. అందుకనే రెండు ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ లబ్దిపొందేట్లుగా తెలంగాణా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఎలాగంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఖాయమట. అలాగే విభజన హామీలన్నింటినీ తూచా తప్పకుండా కాంగ్రెస్ నెరవేరుస్తుందని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రకటనలు మొదలుపెట్టారు. తెలంగాణా ఎన్నికలకు ముందు తర్వాత కూడా ఇదే విషయాన్ని రేవంత్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇందులోని ఆంతర్యం ఏమిటంటే ఏపీలో కాంగ్రెస్ వైపు జనాలను ఆకర్షించటమే కనబడుతోంది.
2014లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత విభజన హామీలను తుంగలో తొక్కేసింది వాస్తవం. విభజన హామీలను అమలుచేయించటంలో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఫెయిలయ్యారు. ఈ ముగ్గురిని బూచిగా చూపించి కాంగ్రెస్ నేతలు పదేపదే ఏపీకి ప్రత్యేకహామీని ప్రస్తావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా ? అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని అందరికీ తెలుసు.
ఏపీకి ప్రత్యేకహామీ ఇస్తున్న రాహుల్ గాంధి, రేవంత్, మంత్రులు అందరికీ ఈ విషయం బాగా తెలుసు. అయినా ప్రత్యేకహోదాను ప్రస్తావిస్తున్నారంటే చంద్రబాబు, జగన్ను వ్యతిరేకించే న్యూట్రల్ ఓటర్లుంటే వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆకర్షించటం కోసం మాత్రమే అని స్పష్టంగా తెలుస్తోంది. పోనీ న్యూట్రల్ ఓటర్లలో కొందరు కాంగ్రెస్ కు ఓట్లేసినా కేంద్రంలో అధికారంలోకి కాదు కదా కనీసం ఏపీలో ఒక్క అసెంబ్లీనైనా గెలుచుకుంటుందా ? ఆ ఛాన్స్ కూడా లేదనే చెప్పాలి. అయినా ఎవరి ప్రయత్నాలు వెళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తోందంతే.