ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. తనయ వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. దరిమిలా.. ఇప్పుడు ఆమె సుదీర్ఘ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆశ యాలను, లక్ష్యాలను సాధించేందుకు తనవంతు నిరంతరం కృషి చేస్తానని దానిలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోనని కూడా షర్మిల చెప్పారు. అయితే.. ఇంత గా కాంగ్రెస్ పెట్టిన లక్ష్యాన్ని సాధించాలంటే.. ఆమె చాలానే కష్టపడాలని అంటున్నారు పరిశీలకులు.
ముందుగా.. షర్మిల రాజకీయంగా కుదురుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏపీలో పెద్దగా లేదు. పైగా ఓటు బ్యాంకు 1శాతం కూడా లేదు. మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాధ్యతలు తీసుకోవడం అంటే.. కత్తిమీద సాములాంటిదే. ఇంకో మాట చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ చిందర వందరగా ఉంది. పార్టీలో ఉన్నా.. నాయకులు యాక్టివ్‌గా లేరనేది వాస్తవం. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని ప్రజలు ఆదరిస్తారో లేదో అనే బెంగ నాయకులను వెంటాడుతోంది.
వైఎస్ అభిమానులుగా ఉన్న నాయకులు కొందరు ఉన్నప్పటికీ.. వారు కూడా సుప్తచేతనావస్థలో ఉన్నారు. పార్టీలో వారు కీలకంగా మారాలంటే.. షర్మిలపై నమ్మకం ఏర్పడడంతోపాటు.. షర్మిల తీరు కూడా వారికి నచ్చాల్సి ఉంటుంది. వైఎస్ లాంటి ఇమేజ్‌ను ఆమె క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తన తండ్రి మాదిరిగా.. అందరికీ అవకాశాలు కల్పించడంతోపాటు.. అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఇలాచేయడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదనే భావన ఉంది.
ఇంకోవైపు.. ఇప్పటికే వైఎస్ ఇమేజ్‌ను, ఆయన పాలన తాలూకు ఫ్లేవర్‌ను ఆయన తనయుడు, వైసీపీ అధినేత, సీఎం జగన్‌వాడుకుంటున్నారు. వైఎస్ వారసుడిగా.. ప్రజలు ఆయనను గుర్తించారనేది వాస్తవం. ఇదే 2019లో ఆయనకు కలిసి వచ్చింది. కాబట్టి.. ఇప్పుడు వైఎస్ తనయగా.. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకుంటున్న షర్మిల.. ఏమేరకు తండ్రి తాలూకు ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారు? ఆయన తాలూకు మనుషులుగా ఉన్న వారిని ఆకట్టుకుంటారనేది చూడాలి. ముందు ఇది సక్సెస్ అయితే.. తర్వాత.. ఎన్నికల పరంగా ఆమె కొంత దూకుడు చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో వైసీపీని నిలువరించేలా ఆమె ఎలా వ్యవహరిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది.