కాంగ్రెస్ హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైమ్‌.. వైఎస్ కుటుంబానికి పెద్ద‌పీట‌!

132 సంవ‌త్స‌రాల కాంగ్రెస్ హిస్ట‌రీలో మునుపు ఎన్న‌డూ జ‌ర‌గ‌ని నిర్ణ‌యం తాజాగా జ‌రిగింది. ఏపీలో కాంగ్రెస్ ప‌గ్గాల‌ను.. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డికి అప్ప‌గిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. వెంట‌నే ఈ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని.. త‌మ ఆదేశాలు కూడా త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని .. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇలా.. ఒక దివంగ‌త నాయ‌కుడి కుమార్తెకు ఏకంగా పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు.

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్టీఆర్ పాల‌నా కాలంలో ఆయ‌న పీసీసీ ప‌గ్గాలు తీసుకున్నారు. త‌ర్వాత ప‌బ్బ‌తి రెడ్డి జ‌నార్ద‌న్‌రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలో నే ఆయ‌న ఎమ్మెల్యేగా ఉంటూ.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న కుమారుడు విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి యువ నాయ‌కుడిగా పార్టీలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌కు ప‌గ్గాలు అప్ప‌గించింది.

ఆ త‌ర్వాత‌.. పొన్నాల లక్ష్మ‌య్య‌.. పార్టీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆయ‌నకు వార‌సులు లేరు. ఇక‌, జానా రెడ్డి కూడా పీసీసీ చీఫ్‌గా చేసినా.. ఆయన త‌ర్వాత‌.. ఆయ‌న కుటుంబంలోని వారికి ఇవ్వాల‌ని పార్టీని కోరినా.. కాంగ్రెస్ ఇవ్వ‌లేదు. ఒక్క ఏపీలోనే కాదు.. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా.. పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌లేదు. మ‌హారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ముర‌ళీ దేవ్‌రా.. సుదీర్ఘ‌కాలం 15 సంవ‌త్స‌రాలు ఉన్నారు. ఆయ‌న వార‌సుడు ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేసిన మిలింద్ దేవరాకు పీసీసీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని ముర‌ళీ కోరారు. అయితే.. ఆయ‌న‌ను ముంబై కాంగ్రెస్ శాఖ బాధ్య‌త‌లు మాత్ర‌మే అప్ప‌గించారు.

ఇక‌, క‌ర్ణాట‌క‌లోనూ అనేక మంది నాయ‌కులు ప‌నిచేసినా.. వారి వార‌సుల‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌లేదు. ఏపీలో అది కూడా విభ‌జ‌న త‌ర్వాత‌.. సుదీర్ఘ కాలానికి దివంగ‌త వైఎస్ కుటుంబానికి చెందిన ఆయ‌న కుమార్తె వైఎస్ ష‌ర్మిల‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం కాంగ్రెస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇది రాజ‌కీయంగా వైఎస్ కుమారుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చెక్ పెట్టే వ్యూహంతో వేసిన అడుగుగానే భావిస్తున్నారు. మ‌రి ష‌ర్మిల ఏమేర‌కు కాంగ్రెస్ ల‌క్ష్యాన్ని సాధిస్తారో చూడాలి.