ఆ ఎమ్మెల్యే… టీడీపీ టు టీడీపీ.. వ‌యా వైసీపీ… !

ఉమ్మ‌డి క‌డప జిల్లా రాజ‌కీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీల‌క‌మైన రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ.. తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేం దుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయ‌న టీడీపీ క‌డ‌ప‌కు చెందిన ముఖ్య నేత‌ను సంప్ర దించారు కూడా. వ‌చ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆశిస్తున్నారు. దీనికి టీడీపీ అధిష్టానంకూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి.. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు. 2019లో ఆ పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, గ‌త రెండేళ్లుగా ఆయ‌న పార్టీతో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి కార‌ణం.. జిల్లా విభ‌జ‌న అంశం. ఇది ఈ నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎఫెక్ట్ చూపించే అవ‌కాశం ఉంద‌ని మేడా న‌మ్ముతున్నారు. రాజంపేట‌ను కేంద్రంగా చేసుకుని అన్న‌మ‌య్య జిల్లా ఏర్పాటు చేయాల‌నేది ఇక్క‌డి వారి డిమాండ్‌.

కానీ, ప్ర‌భుత్వం మాత్రం రాజంపేట కాకుండా.. రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా ఏర్పాటు చేసిం ది. దీనిని వ్య‌తిరేకిస్తూ.. కొన్ని రోజుల పాటు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌ర్నాలు నిర‌స‌న‌లు హోరెత్తాయి. ఇదే విష‌యంపై మేడా కుటుంబం కూడా రెండుగా చీలిపోయి.. ఉద్య‌మాలు చేసింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం సెగ‌ను ముందుగానే గుర్తించిన ఎమ్మెల్యే మేడా.. ఇదే విష‌యాన్ని పార్టీకి చేర‌వేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న అప్ప‌టి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇదిలావుంటే.. త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో నారా లోకేష్‌… టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. రా యచోటిని మార్చి.. రాజంపేట‌ను కేంద్రంగా ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇది ఇక్క‌డి టీడీపీ సానుభూతిని పెంచింది. వాస్త‌వానికి క‌డ‌ప‌లో టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది కూడా ఒక‌టి. సో.. దీంతో ఇప్పుడు క‌డ‌ప‌లో తొలి ఓట‌మి వైసీపీకి ఇక్క‌డే ద‌క్కుతుంద‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి.

ఫ‌లితంగా.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. ఏమాత్రం మేడా చింతించ‌లేదు. కార‌ణం.. ఎలానూ ఆయ‌న పార్టీని మారాల‌ని నిర్ణ‌యించుకున్నందునే. సో.. ఇప్పుడు ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. మొత్తానికి ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ అయితే వ‌చ్చేసింది. గెలుపు కూడా రాసి పెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.