వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఓటు బ్యాంకును మరింతగా చేరువ చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒక్క ఎస్సీలే కాదు.. మేధావి వర్గాన్ని, చదువరులను కూడా వైసీపీ తనవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే .. ఆఘమేగాలపై విజయవాడ నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యుడీ గ్రౌండ్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించింది. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయలను వెచ్చించారు.
ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించి మరీ.. వైసీపీ అధినేత ఈ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసు కున్నారు. మొత్తంగా విగ్రహం ప్రారంభానికి రెడీ అయింది. ఈ నెల 19న అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కూడా చేపట్టనున్నారు. సీఎం జగన్ దాదాపు అరగంటకు పైగానే ఈ వేదిక నుంచి ప్రసంగించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. గ్రామాల్లో సంబరాలు కూడా చేపట్టారు. ఒకవైపు సంక్రాంతి సంబరాలు సాగుతుండగా.. మరోవైపు, అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించి అధికారికంగా వైసీపీ సంబరాలు చేపట్టింది.
ఈ సందర్బంగా వైసీపీ అమలు చేస్తున్న పథకాలు.. ఎస్సీ సామాజిక వర్గానికి చేస్తున్న మేళ్లు.. గత ప్రబు త్వం చేసిన వాటిని కూడా ఏకరువు పెడుతున్నారు. ప్రదానంగా రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి అనుబందంగా 7 ఎస్టీ స్థానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని టార్గెట్ చేయడం ద్వారా.. గతానికి భిన్నంగా.. మొత్తం స్థానాల్లో విజయం దక్కించు కోవాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. ఇక, పార్టీలను వ్యతిరేకించేవారు.. లేదా రాజకీయాలకు దూరంగా ఉండేవారు కూడా.. సమాజంలో ఉన్నారు.
వీరిలో మేధావులు విద్యావంతులు, తటస్థులు ఉన్నారు. రాజకీయాలను వ్యతిరేకించే వారు కూడా.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను మాత్రం విస్మరించరు.. దీనిని గుర్తించిన వైసీపీ ఇలాంటి వారిని తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలుచేస్తోంది. వీరితోనే అసలు చిక్కు ఉందని గ్రహించిన పార్టీ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు అనేక మంది మేధావులను.. ప్రొఫెసర్లను కూడా ఆహ్వానిస్తోంది. తద్వారా.. తాము అందరికీ ఒక్కటేనన్న సంకేతాలు పంపించాలని చూస్తోంది. మొత్తంగా చూస్తే.. అంబేడ్కర్ విగ్రహం ద్వారా.. వీరి ఓట్లను తనవైపు తిప్పుకోవాలన్న వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా? కాదా? అన్నది చూడాలి.