విజయవాడలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకవైపు.. టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తూ.. వైసీపీ నిర్ణయించింది. దీని నుంచి నాయకులు.. విజయవాడ రాజకీయాలు ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు వైసీపీలో మరో దుమారం తెరమీదికి వచ్చిం ది. తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్ వైసీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. ఆయన కమ్మ సామాజిక వర్గం నేత.
గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున బొప్పన పోటీ చేశారు. అయితే.. ఆయన గట్టి పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో ఓటమిపాలయ్యారు. దీనికి ముందు ఆయన కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అయినా.. తనకు ఛాన్స్ ఇవ్వాలనేది బొప్పన డిమాండ్ గా ఉంది. అయితే.. క్షేత్రస్థా యి పరిశీలను.. ప్రజల నాడి వంటివాటిని పరిగణనలోకి తీసుకున్న వైసీపీ ఇక్కడ నుంచి దేవినేని అవినాష్‌కు టికెట్ ఇచ్చింది. దీనిని బొప్పన జీర్ణించుకోలేకపోతున్నారు.
తనను కనీసం పట్టించుకోవడం లేదని, పార్టీలో తనకు ప్రాధాన్యంలేదని ఆయన చెబుతున్నారు. ప్రస్తు తం విజయవాడ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా బొప్పనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గాన్ని పార్టీ వైపు మళ్లించేందుకు, వారి ఓటు బ్యాంకును వైసీపీ కి అనుకూలంగా మార్చేందుకు బొప్పన సేవలు వినియోగించుకోవాలని వైసీపీ భావించింది. ఈ నేపథ్యంలోనే కీలకమైన విజయవాడ బాధ్యతలను అప్పగించింది. అయితే.. ఈ పదవిని పక్కన పెట్టయినా..త నకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని బొప్పన కోరుతున్నారు.
దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు బొప్పన టీడీపీవైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బొప్పనకు స్నేహితుడు, రాజకీయ ఆప్తుడు అయిన.. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన వెంటే.. బొప్పన కూడా అడుగులు వేస్తారని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే.. అంతో ఇంతో వైసీపీపై ప్రభావం పడడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.