ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయటం ఖాయమేనా ? అనే చర్చ పెరిగిపోతోంది. అదికూడా కడప ఎంపీగా పోటీచేయటానికి షర్మిల రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందుకు ఆధారాలు ఏమిటంటే కడప పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రెండురోజులుగా షర్మిల భేటీ అవుతున్నారట. ఈ భేటీల్లో కాంగ్రెస్ నేతలు, తటస్తులే కాకుండా కొందరు వైసీపీ చోటా నేతలు కూడా ఉన్నారని సమాచారం.
షర్మిల అడుగులు చూస్తుంటే కడప ఎంపీగా పోటీచేయటంపై బాగా ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. వైసీపీ తరపున అవినాష్ రెడ్డే పోటీచేయటం దాదాపు ఖాయంగా అనిపిస్తోంది. వివేకారెడ్డి హత్యలో నిందితుడిగా అవినాష్ పై ఆరోపణలున్నా ఎన్నికల్లో అదేమంత ప్రబావం చూపే అవకాశం ఉండదని అధికారపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ కారణంతోనే జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ అవినాష్ నే మూడోసారి పోటీలోకి దింపుతారని టాక్ నడుస్తోంది.
సరిగ్గా ఈ పాయింట్ నే ఆధారం చేసుకుని షర్మిల కూడా ఎంపీగా పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగానే షర్మిల గనుక ఎంపీగా కడపలో పోటీచేస్తే అప్పుడు పోటీ రసవత్తరంగా ఉంటుందనటంలో సందేహంలేదు. బహుశా ఈ సీటును ప్రత్యేకంగా పరిగణించి టీడీపీ, జనసేన కూడా షర్మిలకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్ దేనికవే పోటీచేస్తే ఓట్లు చీలిపోవటం ఖాయం. అప్పుడు అవినాషే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలా కాకుండా అవినాష్ గెలుపును అడ్డుకోవలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికను కంట్రోల్ చేయాలి. ఓట్లలో చీలిక రాకూడదంటే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మధ్య ఏదో స్ధాయిలో ఒప్పందం లేదా అవగాహన తప్పకుండా జరగాల్సిందే. అవినాష్ ఓటమిని పై మూడుపార్టీలు జగన్ ఓటమిగానే పరిగణిస్తున్నాయి. అందుకనే అవినాష్ కు వ్యతిరేకంగా పై మూడుపార్టీలు చేతులు కలపక తప్పదు. అదికూడా షర్మిల పోటీచేస్తే మాత్రమే. లేకపోతే ఏ పార్టీ దారి ఆ పార్టీదే.