వైసీపీ ఎమ్మెల్యే, పిఠాపురం నాయకుడు పెండెం దొరబాబు దారెటు? ఆయన ఏ పార్టీలో చేరనున్నారు? ఇదీ.. ఇప్పుడు నియోజకవర్గం సహా.. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న భారీ చర్చ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం దొరబాబుకు టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ టికెట్‌ను ఎంపీ వంగా గీతకు కేటాయించారు. టికెట్ కోసం దొరబాబు ఎంతో ప్రయత్నించినా.. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలే దు.
వైసీపీ అధిష్టానం ఎంపీ గీతవైపు మొగ్గు చూపింది. దీంతో ఇప్పుడు దొరబాబు తన దారి తాను చూసుకు నేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి రిజైన్ చేయడం.. అదేవిధంగా ఎమ్మెల్యే పదవిని వదులు కొవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీల వైపు కూడా చూస్తున్నారు. గతంలో బీజేపీ తరఫున ఒకసారి విజయందక్కించుకున్న పెండెం దొరబాబు.. తర్వాత గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు.
2004లో బీజేపీ తరఫున దొరబాబు విజయం సాధించారు. తర్వాత.. 2009లో వంగా గీత అప్పటి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. 2014లో వైసీపీ దొరబాబుకు టికెట్ ఇచ్చినా.. ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక, 2019లో విజయం మాత్రం విజయం సాధించారు. అంటే.. దీనిని బట్టి దొరబాబుకు మంచి కేడర్ ఉంది. అదేసమయంలో వంగా గీతకు కూడా ఇక్కడ గెలిచిన హిస్టరీ ఉండడంతో తను ఏదో విధంగా పోటీ చేయాలనేది దొరబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
టీడీపీలో లేదా.. జనసేనలో ఆయన చేరే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన తేల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజకవ ర్గంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ రోజు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తారని ఆయన అనుచరులు చెప్పుకొంటున్నారు. జనసేనలో చేరితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే చర్చ కూడా ఉంది. అయితే.. ఇదే టికెట్ నుంచి జనసేన అధినేత పవన్ స్వయంగా బరిలో నిలిచే అవకాశం ఉందని కొన్నాళ్లుగా చర్చజరుగుతున్న నేపథ్యంలో దొరబాబుకు అవకాశం ఉంటుందా? అనేది చర్చగా మారింది.