ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల తర్వాత.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. తన సొంత నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి వచ్చారు. వైసీపీతో విభేదించిన తర్వాత.. ఆయన దాదాపు ఢిల్లీకే పరిమితం అయ్యారు. సొంత నియోజకవర్గానికి రావాలని ఉన్నప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేయడం ఖాయమని భావించిన ఆయన.. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడకుండా.. అధికారులను ఆన్లైన్‌లోనే కలిసి పనులు చేయించారు.
ఎంపీ లాడ్స్ నిధులను కూడా అలానే ఆన్ లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి.. ఇక్కడ కేటాయించిన పనులను పరిశీలించారు. ఇక, ఎన్నికలకు ముందు వచ్చిన సంక్రాంతి నేపథ్యంలో రఘురామ తన సొంత నియోజకవర్గానికి రావాలని భావించారు. దీనికి కేసులు అడ్డంకిగా మారుతాయని భావించిన ఆయన హైకోర్టును ఆశ్రయించడం.. కోర్టు ఆయనకు అభయం ప్రసాదించడం.. ఏపీ పోలీసులను.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వ్యవహరించాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ముందు రఘురామ తన సొంత నియోజకవర్గానికి చేరుకున్నారు.
ఎంపీ రఘురామకృష్ణం రాజుకి రావులపాలెం సెంటర్లో కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో కలసి ఘనంగా స్వాగతం పలికారు. నాలుగేళ్ల తరువాత రామకృష్ణంరాజు తమ సొంత ఊరు నరసాపురం వెళ్లేందుకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని రావులపాలెం మీదుగా వెళ్లడంతో పార్టీ శ్రేణులతో కలసి సత్యానందరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఇంచార్జీ వలవల బాబ్జి, జనసేన ఇంచార్జీ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు.
కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజుల వరకు రఘురామ ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. సంప్రదాయ క్రీడలు, ఇతర కార్యక్రమాలతో పాటు.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఆయన పర్యవేక్షించను న్నట్టు తెలిసింది. 2019 ఎన్నికల తర్వాత.. కేవలం రెండు సార్లు మాత్రమే తన నియోజకవర్గానికి వచ్చిన రఘురామ.. మళ్లీ ఇప్పుడే రావడంతో స్థానికులు, నియోజకవర్గం ప్రజలు.. సంతోషం వ్యక్తం చేస్తూ.. గజమాలలతో ఆయనకు స్వాగతం పలకడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates