క‌మ్మ వ‌ర్సెస్ బీసీ.. జ‌గ‌న్ ఫార్ములా ఇది!

రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ చేసిన మార్పులు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అవి కూడా పార్ల‌మెంటు స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం. బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం వ‌హిస్తు న్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చేసిన మార్పులు.. రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అవే.. ఒక‌టి ఏలూరు పార్ల‌మెంటు స్థానం, రెండు.. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌స్తుతం క‌మ్మ నేత‌ల చేతిలోనే ఉన్నాయి. విశాఖ ఎంపీగా.. వైసీపీ నాయ‌కు డు ఎంవీవీస‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. ఈయ‌న క‌మ్మ వర్గానికి చెందిన నాయ‌కుడు. తొలిసారి టికెట్ తీసుకుని గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఏలూరు నుంచి కూడా క‌మ్మ వ‌ర్గానికే చెందిన కోట‌గిరి శ్రీధ‌ర్ ఎంపీ గా ఉన్నారు. ఇప్పుడు ఈయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకున్న ఆయ‌న‌కు సొంత కేడ‌ర్ నుంచే అస‌మ్మ‌తి సెగ రావ‌డంతో ప‌క్క‌న పెట్టార‌నే చ‌ర్చ ఉంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఆయా జిల్లాల్లోనే కాదు.. రాజకీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నా యి. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త నాలుగు ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. బీసీల‌కు ఇక్క‌డ ఛాన్స్ లేదు. గ‌తంలో ఏలూరు నుంచి మాగంటి బాబు(క‌మ్మ‌) ప్రాతినిధ్యం వ‌హించారు. త‌ర్వాత‌.. ఇదే సామాజిక వ‌ర్గం నేత కోట‌గిరి ఇక్క‌డి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. ఇప్పుడు ఇక్కడ బీసీ సామాజిక వ‌ర్గం యాద‌వ కులానికి చెందిన కారుమూరి సునీల్‌కు వైసీపీ టికెట్ ఇచ్చేసింది.

ఇక‌, విశాఖ‌లోనూ కొన్ని ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. గ‌తంలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ కూడా.. క‌మ్మ‌ల కే ప్రాధాన్యం ఇచ్చాయి. కాంగ్రెస్ నుంచి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విజ‌యం ద‌క్కించుకోగా.. బీజేపీ నుంచి కంభంపాటి హ‌రిబాబు విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. వైసీపీ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గానికే టికెట్ ఇచ్చింది.

ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు బీసీ నాయ‌కురాలు.. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకోవ‌డంతోపాటు.. బీసీల‌కు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు టీడీపీ ఎలాంటి అడుగులు వేస్తుంద‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.