కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ కీలక నేతల్లో ఒకరు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ భార్యే నిర్మల.
ప్రస్తుతం రైట్ ఫోలియో పేరుతో పొలిటికల్ అనాలసిస్, మార్కెట్ రీసెర్చ్ అనే కంపెనీ పెట్టుకుని దానికి ఎండీగా కొనసాగుతున్నారాయన. భార్య కేంద్ర మంత్రి అయినపుడు అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగానే ఆయన వైఖరి ఉంటుందని ఎవరైనా అనుకుంటారు.
కానీ పరకాల ప్రభాకర్ మాత్రం ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా తన భార్య నడుపుతున్న శాఖ మీద విమర్శలకు దిగారు. కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. దీని కంటే ముందే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పగా.. కరోనా దెబ్బకు కుదేలైపోయింది.
దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు దారుణంగా పడిపోయి.. నెగెటివ్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అది మైనస్ 23 శాతంగా ఉంది. దీని గురించి ఇటీవల విలేకరులు అడిగితే.. అది మన చేతుల్లో లేదని.. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని పేర్కొంటూ కరోనా వల్లే ఇలా అయిందనే అర్థంలో మాట్లాడారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్.
దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమెపై వ్యంగ్యాస్త్రాలు పడుతున్నాయి. అలా కౌంటర్లు వేసేవాళ్లలో పరకాల ప్రభాకర్ సైతం చేరడం విశేషం. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ ఆయన.. ట్వీట్ వేశారు. ప్రభుత్వం సూక్ష్మ-ఆర్థిక సవాళ్లపై తగిన విధంగా స్పందించకపోవడమే అసలైన ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అన్నారు.
ఆర్థిక పరిస్థితి గాడి తప్పడాన్ని తాను గత అక్టోబరులోనే ఊహించానని.. కరోనా ఆ తర్వాత వచ్చిందని.. ముందు వాస్తవాన్ని అంగీకరించని ప్రభుత్వానికి తాజాగా జీడీపీ వృద్ధిరేటు పడిపోవడంతో నిజం తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ఏదో ఒకటి చేసి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలంటూ పరోక్షంగా తన భార్యకే చురక అంటించి సంచలనం రేపారు పరకాల.