వైసీపీ రెబల్ ఎంఎల్ఏ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి రెండోవారం లోపు రాజీనామా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తులో నరసాపురం పార్లమెంటు సీటులో పోటీచేయబోయే పార్టీలో తాను చేరతానన్నారు. పై రెండుపార్టీలతో బీజేపీ కూడా చేరితే బాగుంటుందని జనాలు అనుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు. రచ్చబండ కార్యాక్రమంలో మీడియాతో మాట్లాడుతు తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తనను అనర్హుడిగా ప్రకటింపచేయటంలో వైసీపీ ఫెయిలైందని సెటైర్లు వేశారు.
పై కూటమి అధికారంలోకి రావటం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. పోయిన ఎన్నికల్లో ఎంపీగా తన ఛరిష్మాతోనే గెలిచినట్లు చెప్పుకున్నారు. ఎంపీ సొంత ఛరిష్మాతోనే గెలిచారా లేకపోతే వైసీపీ అభ్యర్ధిగా పోటీచేయబట్టే గెలిచారా అన్నది ఇపుడు అప్రస్తుతం. ఎందుకంటే 2014లో ఇదే సీటులో వైసీపీ ఓడిపోయినప్పుడు తెచ్చుకున్న ఓట్లకన్నా 2019లో గెలిచినపుడు వైసీపీకి వచ్చిన ఓట్లు తక్కువ. నిజంగానే వ్యక్తిగత ఛరిష్మాతోనే రాజు గెలిచుంటే వచ్చిన మెజారిటి 30 వేల ఓట్లేనా ?
ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఫిబ్రవరి 2వ వారంలో రాజీనామా చేయటం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి ? అసలు రాజీనామా చేయమని ఎవరడిగారు ? రాజీనామా చేసినా చేయకపోయినా ఎన్నికల సమయానికి ఎంపీ కాలపరిమితి ముగిసిపోవటం ఖాయం. షెడ్యూల్ ఎన్నికలు మార్చి-ఏప్రిల్ లో జరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాస్త ముందుగా జరిగితే కాలపరిమితి కూడా ఇంకాస్త ముందే ముగుస్తుంది. ఇంతోటి దానికి రఘురాజు ఎంపీగా రాజీనామా చేస్తే ఏమిటి ? చేయకపోతే ఏమిటి ?
జగన్ తో విభేదించి వైసీపీ నుండి బయటకు వచ్చినపుడే ఎంపీ పదవికి రాజీనామా చేసుంటే అందరు మెచ్చుకునేవారు. రాజీనామా ద్వారా ఉపఎన్నికలు తెప్పించి మళ్ళీ పోటీచేసి గెలిచుంటే రఘురాజను గొప్పోడనేవారు. అప్పుడు వ్యక్తిగత ఛరిష్మాతోనే తాను గెలిచానని రఘురాజు చెప్పుకున్నా అర్ధముండేది. అలాకాకుండా పదవిని పట్టుకుని ఊగులాడుతు, అప్పుడు రాజీనామా చేస్తా, ఇపుడు రాజీనామా చేస్తానని డెడ్ లైన్ విధించి పదవీ కాలాన్నంత గడిపేసిన ఎంపీ ఇపుడు రాజీనామాను ప్రకటించటమే విచిత్రంగా ఉంది. అసలు ఇపుడే ఎంపీగా రాజీనామా చేయకుండా ఫిబ్రవరి రెండోవారం ముహూర్తంగా ప్రకటించటం ఎందుకు ?