కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైనం చర్చనీయాంశమైంది. తన అన్న జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు షర్మిల విషెస్ చెప్పడం సంచలనం రేపింది. ఆ వ్యవహారం చర్చనీయాంశంగా ఉన్న తరుణంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో షర్మిల భేటీ అయ్యారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి షర్మిల వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని బాబు కుటుంబాన్ని షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబుకు షర్మిల తన కుమారుడి పెళ్లి పత్రిక స్వయంగా ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రబాబును షర్మిల కలవడం ఇదే మొదటిసారి. షర్మిలను చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ కుటుంబంలో వివాహాలకు చంద్రబాబును గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆహ్వానించారని, చంద్రబాబు కూడా హాజరై తమను ఆశీర్వదించారని షర్మిల అన్నారు. ఆ సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తూ తన కుమారుడి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించానని, అందులో వింత, విచిత్రం ఏమీ లేదని చెప్పారు. వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని తనతో చంద్రబాబు గుర్తు చేసుకున్నారని అన్నారు. తమ భేటీని స్నేహపూర్వకంగానే చూడాలని అన్నారు. తెలంగాణ అయినా, ఏపీ అయినా..కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఎక్కడ అప్పగించినా వెళతానని అన్నారు.