బీఆర్ఎస్ బలం ఎలాగ వచ్చిందో అలాగే పోతున్నట్లుంది. వరద వచ్చినపుడు ఉన్న నీటిపోటు తర్వాత ఉండదని పెద్దలు ఊరికే చెప్పలేదు. అదే పద్దతిలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావటంతో మొదలైన బీఆర్ఎస్ హవాకు 2023లో బ్రేకులు పడింది. దాంతో అప్పట్లో ఎలా బలం పుంజుకున్నదో అదే పద్దతిలో ఇపుడు బలాన్ని కోల్పోతోంది. అంటే బీఆర్ఎస్ ది వాపే కానీ బలుపుకాదని అర్ధమైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలోని మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఊడ్చేస్తోంది.
అధికారంలో ఉన్న కారణంగా అప్పట్లో కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ తనలో కలిపేసుకున్నది. ఛైర్మన్లను బెదిరించి, కౌన్సిలర్లను బీఆర్ఎస్ లోబరుచుకుంటోందని అప్పట్లో కాంగ్రెస్ నేతలు గోలచేసినా పట్టించుకోలేదు. పదేళ్ళు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఇలాగే అధిక్రాన్ని చెలాయించింది. అధికారం పోయినప్పటినుండి పరిస్ధితులు తల్లకిందులవుతున్నాయి. బీఆర్ఎస్ చేతిలోని మున్సిపాలిటీలన్నీ ఇపుడు కాంగ్రెస్ పరమవుతున్నాయి. చాలా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ ఛైర్మన్లను దింపేస్తున్నారు.
ఇప్పటికే ఆర్మూరు, నల్గొండ, మంచిర్యాల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కోల్పోయింది. ఈ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామాలు చేయటంతో అవిశ్వాస తీర్మానాలు పెట్టి చైర్మన్లను దింపేశారు. వాటిని కాంగ్రెస్ సొంతం చేసుకున్నది. ఇవికాకుండా మరో 36 మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు అందాయి. అధికారానికి అలవాటుపడిపోయిన కౌన్సిలర్లు, ఛైర్మన్లు బీఆర్ఎస్ ఓడిపోగానే కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. దాంతో మున్సిపాలిటి స్ధాయిల్లో బీఆర్ఎస్ పట్టుకోల్పోతోంది. మంచిర్యాల, చేర్యాల, కాగజ్ నగర్ మున్సిపాలిటిల్లో ఈనెలలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చలు, ఓటింగ్ జరగబోతోంది.
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే బహుశా మరో నెలరోజుల్లోపే అన్నీ మున్సిపాలిటిలు కాంగ్రెస్ ఖాతాలో పడిపోవటం ఖాయంగా ఉంది. మున్సిపాలిటీల్లో మెజారిటి బీఆర్ఎస్ కే ఉన్నా కౌన్సిలర్లందరు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. దీంతో కొద్దిరోజుల్లోనే మున్సిపాలిటిల్లో బీఆర్ఎస్ కనుమరుగైపోవటం ఖాయంగా ఉంది. ఇదే దెబ్బ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే తొందరలోనే బీఆర్ఎస్ కనుమరుగైనా ఆశ్చర్యపోవక్కర్లేదనిపిస్తోంది.