ఆయన ఎమ్మెల్యే. సహజంగానే అధికారికంగా ఆయన దర్పానికి తిరుగు ఉండదు. పార్టీ కూడా అధికారంలోనే ఉంది కాబట్టి.. ఇక, ఆయన నేలపై కూడా నడవాల్సిన అవసరం లేదు. ఇది.. సహజంగా అందరి ఎమ్మెల్యేల గురించి జరిగే చర్చ. కానీ, అందరిలా తాను ఎందుకు ఉండాలి? అనుకున్నారో ఏమో.. ఆ ఎమ్మెల్యే తనలోని సహజత్వానికి ప్రతీకగా నిలిచారు. వైద్యో నారాయణో హరి అన్న నానుడిని ఆయన నిజం చేశారు. ముందు వృత్తి.. తర్వాత రాజకీయం అనే నిర్ణయానికి వచ్చారు. స్వయంగా ఓ గర్భిణికి ఆపరేషన్ ద్వారా ప్రసవం చేశారు. అందరితోనూ శభాష్ డాక్టర్ ఎమ్మెల్యే అని అనిపించుకుంటున్నారు.
ఆయనకే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు.. డాక్టర్ వంశీకృష్ణ. తాజాగా శుక్రవారం ఎమ్మెల్యే తన దైనందిన పనుల్లో భాగంగా ఇంటి నుంచి బయటకువచ్చారు. ఈ సమయంలో ఆయనకు జీలుగుపల్లి ప్రాంతానికి చెందిన ఓ గర్భిణీ పురుటి నొప్పులతో బాధపడుతూ.. ఎదురైంది. ఆమె వెంట ఒకరిద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో వారు ఆసుపత్రికి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ ఎమ్మెల్యే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కేవలం ఆయన ఈ సూచనలతోనే ఆగిపోలేదు.
తన పనులు కూడా వాయిదా వేసుకుని.. గర్భిణి వెంటే ఆసుపత్రికి ఎమ్మెల్యే వంశీకృష్ణ వెళ్లారు. అక్కడ స్వయంగా ఆయన డాక్టర్ దుస్తులు ధరించి.. గర్భిణికి ఆపరేషన్ చేసి.. ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను తన చేతులతోనే తల్లికి అప్పగించిన ఎమ్మెల్యే అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఆ సమయంలో తనకు ప్రసవం చేసి.. పండంటి బిడ్డకు జన్మనివ్వడంలో సాయం చేసిన డాక్టర్ ఎమ్మెల్యేకు ఆ మాతృమూర్తి కృతజ్ఞతలు తెలిపింది. ఇక, ఈ విషయం వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates