పల్నాడు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున బరిలో దిగనున్న మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ దూకుడు పెరిగిందనే అంచనాలు వస్తున్నాయి. తాజాగా సామాజిక వర్గాల పరంగా టీడీపీ చేపట్టిన ఓరల్ సర్వేలో ఇక్కడి మెజారిటీ కాపు సామాజిక వర్గం నాయకులు కన్నాకే జై కొట్టినట్టు తెలిసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కన్నా..పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా చేశారు. దీంతో ఆయనకు పోల్ మేనేజ్‌మెంట్‌లో గట్టి అనుభవం ఉంది.
ఇదే ఇప్పుడు ఆయనకు ప్లస్‌గా మారింది. సత్తెనపల్లి నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు అప్పగించిన వెంటనే ఆయన అక్కడ పర్యటించడమే కాకుండా.. చాపకింద నీరులాగా మండల స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తున్నారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి, అంబటి రాంబాబుకు జై కొట్టిన కాపులు ఇప్పుడు ఆటోమేటిక్‌గా కన్నావైపు మళ్లుతున్నారు. ఇది ఆయనకు ప్లస్‌గా మారింది. ఇదిలావుంటే.. 2014లో ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న కోడెల శివప్రసాదరావు కూడా.. టీడీపీకి బలమైన పునాదులు వేశారు.
ఆయన హఠాన్మరణం చెందినా.. టీడీపీ ఓటు బ్యాంకు స్తిరంగానే ఉంది. ఈ నేపథ్యంలో కోడెల వర్గాన్ని కూడా తనవైపు తిప్పుకో వడంలో ఎలాంటి వెనుక ముందు ఆలోచించకుండా.. అవసరమైతే.. నాలుగు మెట్లు దిగి అయినా.. కన్నా వ్యూహాత్మకంగా చతురత ప్రదర్శిస్తున్నారు. దీంతో కోడెల వర్గం కూడా.. ఆయనకు చేరువ అవుతున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉండడం.. రాజకీయంగా దూకుడు ఉన్న నాయకుడిగా ఆయన ప్రజల్లో మంచి పేరు ఉండడం కలిసి వస్తున్నాయి. ఇక, మరో కీలక విషయం.. కాంగ్రెస్ నేతల మాట.
గతంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేసిన కన్నాకు.. ఆ పార్టీ నేతలపైనా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలోని కాంగ్రెస్ నేతలను కూడా తనవైపు తిప్పుకొంటున్నారు. ఇక, జనసేన అభిమానులు.. పవన్ అభిమానులు.. ఆ పార్టీ నాయకులు కూడా.. కన్నావైపే ఉన్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉన్నా.. ఇప్పుడు మాత్రం టీడీపీ-జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగిన నేపథ్యంలో ఈ దఫా కన్నావైపే జనసేన అభిమానులు, నాయకులు నిలబడుతున్నారు. మొత్తంగా చూస్తే.. కన్నాకు కాపులు.. ఇతర సామాజిక వర్గాలతో పాటు.. అన్ని విధాలా సమీకరణలు కలిసి వస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates