విజ‌య‌వాడ‌పై చంద్ర‌బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌

విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని.. పార్టీకి గుడ్ బై చెప్ప‌డం.. ఆ వెంట‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డం.. తెలిసిందే. ఇక‌, తాజాగా వైసీపీ విడుద‌ల చేసిన మూడో జాబితాలో కేశినేని పేరు కూడా ఉండ‌డంతో ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని వ‌దులుకునేందుకు వీల్లేకుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు.

వ‌రుస‌గా.. టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. వైసీపీకి మ‌ళ్లినా.. 2014లో మాత్రం విజ‌య‌వాడ‌లో టీడీపీకి అండ‌గా నిలిచారు. అదేవిధంగా వైసీపీ గాలులు బ‌లంగా వీచిన 2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని టీడీపీ నిల‌బెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా టీడీపీకి తిరుగులేద‌నే సంకేతాలు ఇవ్వాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ఉన్నారు.

ఈ క్ర‌మంలో అనూహ్యంగా కేశినేని నాని తిరుగు బాటు చేయ‌డం.. వైసీపీలోకి వెళ్ల‌డంతో పాటు 60 శాతం మంది నాయ‌కుల‌ను లాగేస్తాన‌ని కూడా చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న స‌వాల్ విసిరిన‌ట్టు అయింది. దీనిని త‌ట్టుకునేందుకు.. టీడీపీని మ‌రోసారి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు చంద్ర‌బాబు నంద‌మూరి కుటుంబానికి చెందిన సుహాసినిని ఇక్క‌డ‌కు తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విష‌యం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే జ‌రిగితే.. నంద‌మూరి అభిమానులు.. పార్టీ శ్రేణులు కూడా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో తెలంగాణ‌లో పోటీ చేసిన సుహాసిని అక్కడ బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. కానీ, ఏపీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయ‌లేదు. దీంతో ఆమెను ఇక్క‌డ‌కు తీసుకురావ‌డం ద్వారా.. బ‌ల‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇవీ.. బ‌లాబ‌లాలు..

నంద‌మూరి కుటుంబం అనే సెంటిమెంటు సుహాసినికి బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. అదేవిధంగా విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి గ‌త 20 ఏళ్ల‌లో పోటీ చేసే మ‌హిళా అభ్య‌ర్థిగా కూడా ఆమె రికార్డు ఎక్క‌నుంది. అదేవిధంగా టీడీపీలోని అంత‌ర్గ‌త విభేదాలు.. నాయ‌కుల మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌యలేమి వంటివి కూడా స‌మ‌సి పోయే అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.