రాబోయే ఎన్నికలకు ఏపీ బీజేపీ కూడా రెడీ అయిపోతోంది. పార్టీ తరపున పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహుల జాబితాలను సిద్ధం చేయాలని జాతీయ నాయకత్వం నుండి పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఆదేశాలు అందాయి. వచ్చిన ఆదేశాలతో హడావుడిగా పురందేశ్వరి కమిటీలను వేశారట. ప్రతి పార్లమెంటు జిల్లాకు ముగ్గురు సీనియర్ నేతలతో కమిటీలు వేశారు. ఈ కమిటీలే తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లాల్లో విస్తృతంగా తిరుగుతాయి. అన్నీ నియోజకవర్గాల్లోని నేతలను కలిసి ఆశావహుల పేర్లను సేకరిస్తాయి.
జిల్లాల పర్యటనల్లో కమిటిలు సేకరించిన పేర్లను రాష్ట్ర కమిటీయే వడ పోస్తుంది. అలా షార్ట్ లిస్ట్ చేసిన ఆశావహుల పేర్ల జాబితాలను కేంద్ర నాయకత్వానికి పంపుతుంది. అక్కడ ఏమన్నా మార్పులు, చేర్పులుంటే మాట్లాడుకుని జాబితా ఫైనల్ అవుతుంది. త్రిసభ్య కమిటిలు వెంటనే యాక్షన్లోకి దిగాలని, జిల్లాల పర్యటనలు చేయాలని అగ్రనాయకత్వం ఆదేశించింది. కాబట్టి మరో వారం లోపు కమిటీల జిల్లాల పర్యటనలు పూర్తయిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సడెన్ గా జిల్లాలకు త్రిసభ్య కమిటీలను వేయటం వెంటనే రంగంలోకి దిగి ఆశావహుల పేర్లతో జాబితాలను రెడీచేయమని ఆదేశించటం వెనుక ఉద్దేశ్యం ఏమిటో అర్ధంకావటంలేదు. టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీ రెడీ అవుతోందని ఈమధ్యనే వార్తలు వచ్చాయి. బీజేపీతో పొత్తుకు చంద్రబాబునాయుడు చాలా ఆసక్తిగా ఉన్నారు. మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చాలాసార్లు బీజేపీ నేతలను పొత్తుకు ఒప్పిస్తానని చెప్పారు. ఒకసారి టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందని ప్రచారం జరుగుతుంది. మరోసారి టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలకు వెళతాయనే ప్రచారం పెరిగిపోతుంది.
ఇలాంటి ప్రచారాలతో కమలనాథుల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. తాజాగా అగ్రనాయకత్వం నుండి అందిన ఆదేశాలతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకు రెడీ అవుతోందనే అనుకోవాల్సుంటుంది. అదే జరిగితే చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు ఫెయిలనట్లే. ఈ మధ్యనే జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కూడా టీడీపీతో పొత్తుండాలని బీజేపీ నేతలు తీర్మానం చేసి అగ్రనేతలకు పంపారు. ఒంటరి పోటీతో ఓట్లొస్తాయే కాని సీట్లు రావని సమావేశం అభిప్రాయపడింది. మరిపుడేమో జాబితాలను రెడీ చేసి పంపమని ఆదేశాలొచ్చాయి. పార్టీలో ఏమి జరుగుతోందో కూడా అర్థం కావట్లేదు.