ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇందుకు ఈనెల 25వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్నీ పార్టీ మెంటు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూటుమ్యాప్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన పర్యటనను ఉత్తరాంధ్ర నుండే మొదలుపెట్టబోతున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగసభ చొప్పున 26 సభలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించేట్లుగా రూట్ మ్యాప్ రెడీ అయ్యింది.
ఈ పర్యటనల్లోనే జగన్ అభ్యర్ధులను జనాలకు పరిచయటం చేయబోతున్నారు. బహిరంగసభలు జరుగుతున్న వేదికమీద నుండే పార్లమెంటు అభ్యర్ధితో పాటు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులను కూడా పరిచయం చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. 26 సభల్లోనే అభ్యర్ధులను ఇలాగే పరిచయం చేయాలన్నది జగన్ ఆలోచన. దీంతో మొదటిరౌండ్ ప్రచారం పూర్తవుతుంది. ఆ తర్వాత రెండో రౌండు ప్రచారంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెట్టినపుడు ప్రత్యేకంగా ఎంఎల్ఏ అభ్యర్ధుల పరిచయ కార్యక్రమం ఉండాలన్నది జగన్ ఆలోచన.
ఇపుడు జరగబోయే పర్యటనలోనే పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసంతృప్త నేతలను కూడా బుజ్జగించే కసరత్తు కూడా ఉందని పార్టీవర్గాల సమాచారం. అలాగే వీలైనంతలో తన పర్యటనల్లో భాగంగా తటస్తులుగా ఉండే ప్రముఖులతో భేటీలు నిర్వహించాలని జగన్ ఆలోచిస్తున్నారట. వీలైతే తటస్తుల ఇళ్ళల్లోనే బసచేసి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే మరింత ఎఫెక్టుగా ఉంటుందన్నది వ్యూహం. టికెట్లు దక్కని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ భవిష్యత్తుపై భరోసా ఇవ్వబోతున్నారు. అభ్యర్ధులను ఎందుకు మార్చాల్సొచ్చిందనే విషయాన్ని పర్యటనల్లో పార్టీ నేతలు, క్యాడర్ తో పాటు జనాలకు కూడా డైరెక్టుగానే జగన్ వివరించబోతున్నారట.
రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లను గెలుచుకోవాలన్నది జగన్ టార్గెట్. ఇందుకోసం గట్టి అభ్యర్ధుల ఎంపికకు ఒకటికి పదిసార్లు సర్వేలు చేయించుకున్నారు. వాటి రిపోర్టు ప్రకారమే అభ్యర్ధుల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికి మూడుజాబితాల్లో 51 అసెంబ్లీలకు అభ్యర్ధులను ప్రకటించారు. మరో వారం రోజుల్లో మిగిలిన అభ్యర్ధులను కూడా ప్రకటించేయాలన్నది జగన్ టార్గెట్. అందుకనే 25 నుండి పర్యటనలకు వెళ్ళేట్లుగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. దాదాపు ఇలాంటి షెడ్యూల్ తోనే చంద్రబాబునాయుడు కూడా బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. పవన్ కల్యాణ్ మాత్రమే ఇంకా బరిలోకి దూకలేదు. మరెప్పుడు దిగుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates