టీడీపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే.. ఇది పైకి చెప్పకపోయినా.. అంతర్గత సమావేశాల్లో 25 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. అయితే.. ఈ పాతిక మంది కూడా పాతకాపులే కావడం గమనార్హం. నిజానికి వీరంతా గత ఎన్నికల్లో మెజారిటీ సంఖ్యలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వారికే టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సిద్ధం చేసిన జాబితాలో ఒకటి రెండు ముఖాలు మార్చినా.. ఆయా కుటుంబాలకు నియోజకవర్గాల్లో ఉన్న గ్రాఫ్‌ను ఎంత వరకు పరిగణనలోకి తీసుకున్నారనేది పార్టీ అంతర్గత చర్చల్లో ప్రధాన విషయంగా మారింది. ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్ఢ స్థానం, కర్నూలు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ, కర్నూలు నుంచి టీజీ భరత్‌లకు చోటు దక్కనుంది. కానీ, వీరిద్దరూ గత ఎన్నికల్లో ఓడిపోయారు.
ఓడిపోవడం, గెలవడం.. అనేది వారి చేతుల్లో లేకపోయినా.. ఓటమిగల కారణాలను అధ్యయనం చేసి.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేశారా? అనేది ఇప్పుడు చర్చగా మారింది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే.. గత ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితి కంటే ఘోరంగా ఈ ఇద్దరునేతల పరిస్థితి ఉందనేది పార్టీలోనే జరుగుతున్న చర్చ. ఇక, కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డిని ఖరారు చేశారు. ఈయనకు మంచి పేరు ఉన్నప్పటికీ.. గత ఎన్నికల్లో ఓడిపోయారు.
మరి అప్పటిపరిస్థితిని ఈయన మార్చుకున్నారా? అనేది ప్రశ్న. అదేవిధంగా తిరువూరుకు శ్యావల దేవదత్ ను నియమించారు. ఈయనకుటికెట్ ఖారరైంది. కానీ, కలిసి వచ్చే నాయకులు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం కూడా కరువైంది. ఆచంటకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి ఏంటనేది కూడా పార్టీ దృష్టి పెట్టినట్టు లేదు. బొబ్బిలికి బేబి నాయన, తునికి యనమల దివ్యలను నియమించారు. వీరికే టికెట్లు ఇస్తున్నారు. కానీ, వీరి గ్రాఫ్ ఎంత.. బలమైన పోటీని తట్టుకుని నెట్టుకుని వస్తారా? అనే విషయాలపై పార్టీ అంచనాలు వేయకుండానే మొహమాటాలు.. మాట తీరుకు పడిపోతోందనే చర్చ సొంత పార్టీలోనే సాగుతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.