ఏ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అయినా తాను సిద్ధమేనని తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఇటీవల టికెట్ దక్కదని తెలిసిన తర్వాత.. తీవ్ర విమర్శలు గుప్పించిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే.. తాజాగా మంగళవారం ఆయన ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కలిశారు. ఆయన పాదాలపై కూడా పడ్డారు.
దీంతో కాపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితిలో లేకపోవడం.. వెళ్లినా పరాభవం తప్పదని నిర్ణయించుకున్న దరిమిలా.. కాపు వారి ఆఫర్ మారింది. ఏ పార్టీ అయినా.. అంటూ ఆయన దీర్ఘాలు తీశారు. ఇక, ఆయన పరిస్థితిని గమనిస్తే.. స్థానికంగా మంచి పలుకుబడి ఉన్నప్పటికీ.. అంతేస్థాయిలో ఆరోపణలు కూడా ఉన్నాయి. రాయదుర్గంలో టీడీపీ బలంగా ఉంది.
ఇక్కడ నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పోటీ ఖాయంగా ఉంది. ఆయన గెలుపుపై సైకిల్ పార్టీకి భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపు వస్తామన్నా.. పార్టీ చేర్చుకునే అవకాశం లేదు. ఇక, జనసేనలోకి వెళ్లాలన్నా.. పొత్తు ఉన్న టీడీపీ టికెట్ ఇచ్చేందుకు అవకాశం లేదు. అయితే.. కళ్యాణదు్ర్గం టికెట్‌ను కూడా ఆశిస్తున్నందున.. అక్కడ పరిశీలించే అవకాశం ఉంది. కానీ.. ఇప్పటికే కళ్యాణదుర్గంలో ఉన్న టీడీపీనాయకులు టికెట్ కోసం కుస్తీలు పడుతున్నారు.
దీంతో అక్కడ కూడా కాపు ప్రయత్నాలు సాగేలా కనిపించడం లేదు. మరోవైపు.. బీజేపీ నుంచి ఆఫర్లు ఎదురు వస్తుండడం ఒక్కటే కాపు ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. కానీ, ఆ పార్టీలోకి వెళ్తే.. ఇప్పటి వరకు ఆయనకు జై కొట్టిన మైనారిటీ వర్గం దూరమయ్యేసూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కాపు వారి ప్రయత్నాలు .. ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్నాయి. మరి ఏంచేస్తారోచూడాలి.