రాబోయే ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు లేదా పార్లమెంటు సీట్లు చాలా హాటుగా మారబోతున్నాయి. ఇలాంటి హాట్ సీట్లలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా ఒకటి. ఇప్పటికి ఇది టీడీపీ ఖాతాలోనే ఉంది. సీనియర్ తమ్ముడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంఎల్ఏగా ఉన్నారు. వచ్చేఎన్నికల్లో ఈసీటు ఎలా హాటుగా మారబోతోందంటే ఇదే సీటులో పోటీచేయాలని జనసేన మహా పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో వైసీపీ తరపున మంత్రి చెల్లుబోయిన వేటుగోపాలకృష్ణ పోటీకి రెడీ అవుతున్నారు.
వైసీపీ తరపున అభ్యర్ధి ఖరారయ్యారు కానీ మిత్రపక్షాల మద్యే ఏ విషయం తేలలేదు. తాను మళ్ళీ పోటీలో ఉంటానని గోరంట్ల చెబుతున్నారు. చెప్పటమే కాదు నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ సీటులో పోటీచేయబోయేది తానే అని జనసేన నేత కందుల దుర్గేష్ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కందుల పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళని అందరికీ తెలిసిందే.
కాబట్టి పవనే తనకు సీటు ఇప్పిస్తారని కందుల గంపెడాశతో ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. సో, రెండుపార్టీల్లో ఏ పార్టీ పోటీచేస్తుందనే విషయం వల్లే రాజమండ్రి రూరల్ సీటు హాటుగా మారిపోయింది. దీనికి అదనంగా మంత్రి ఇక్కడి నుండి పోటీకి రెడీ అవటం కూడా కారణమే. ఇక్కడ గమనించాల్సిన మరో పాయింట్ ఏమిటంటే ముగ్గురు నేతలు కూడా మూడు సామాజికవర్గాలకు చెందిన వాళ్ళు. గోరంట్లేమో కమ్మ, కందులేమో కాపు, చెల్లుబోయినేమో బీసీ. మూడు సామాజికవర్గాల ఓట్లు బాగానే ఉండటం వల్లే ఎవరికి వాళ్ళు గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు.
రాజమండ్రి రూరల్ సస్పెన్స్ వీడాలంటే ముందు చంద్రబాబునాయుడు-పవన్ మధ్య చర్చలు ఫైనల్ అవ్వాలి. వీళ్ళ మధ్య ఫైనల్ అయిపోయుండచ్చని రెండుపార్టీల్లో టాక్ నడుస్తోంది. అయితే ఆ నిర్ణయమేదో బయటకు రాలేదు. అందుకనే రెండుపార్టీల్లోని నేతలు ఎవరికి వాళ్ళుగా ప్రచారం చేసుకుంటున్నారు. చివరకు ఏ పార్టీ పోటీచేస్తుందనే విషయం ఫైనల్ అయితే రెండో పార్టీ నేత ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.