ఏపీలో మరో రెండు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతాయి. గ్రామీణ స్థాయిలో వైసీపీకి గ్రాఫ్ బాగానే ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇంటింటి కీ పింఛన్లు, రేషన్, వైద్యం, ఇంటి డాక్టర్ కాన్సెప్టు, ఆరోగ్యశ్రీ వంటివి పార్టీకి మేలు చేస్తున్నాయని నాయకులు లెక్కలు వేసుకున్నారు. దీంతో గ్రామీణ స్థాయిలో పార్టీకి ఇబ్బంది లేదని భావిస్తున్నారు. ఇక, ఎటొచ్చీ.. కీలకమైన నగరాలు.. పట్టణాల్లో ఓటు బ్యాంకు ఎలా ఉందనేది ఇప్పడు వైసీపీకి సందేహంగా ఉంది.
గ్రామీణ స్థాయిలో నాయకుల పరిస్థితిని బట్టి.. టికెట్ దక్కించుకునే అభ్యర్థులను బట్టి ఒక్కొక్కసారి ఓటు బ్యాంకు మార్పులు చేర్పులు ఉంటాయి.పైగా సంస్థాగతంగా పార్టీలకు ఉన్న బలాబలాలు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. కానీ.. పట్టణాలు, నగరాలకు వచ్చే సరికి నాయకులను చూసి ఓటేసే వారికంటే కూడా.. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు వంటివి ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే విషయం స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోరుకున్న ప్రజలు.. పట్టణాలు, నగరాలకు వచ్చేసరికి అభివృద్ధికి, ఐటీకి ఫిదా అయ్యారు.
ఈ క్రమంలో ఏపీ విషయానికి వస్తే.. కూడా ఇదే పరిణామాలు కనిపించే అవకాశం ఉందనే భావన పార్టీల్లో ఉంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గ్రామీణ ప్రాంతాలకన్నా నగరాలు, పట్టణాలపైనే ఫోకస్ పెంచింది. ఇక్కడ ఎక్కువ మందిని ఆకర్షించడం ద్వారా.. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ ఇటు గ్రామాలు, అటు పట్టణాలు, నగరాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. గ్రామీణ స్థాయిలో గృహ సారథులు రంగంలోకి దిగి.. ఇంటింటికీ తిరుగుతున్నారు.
కానీ, పట్టణాలు, నగరాల విషయానికి వస్తే.. మాత్రం అభివృద్ధి, రహదారులు, ఉపాధి, ఉద్యోగాలు వంటివి ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, చిత్తూరు సహా.. రాష్ట్రంలోని 17 మునిసిపాలిటీలు.. 7 కార్పొరేషన్లలో వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇక్కడ నుంచి వైసీపీ నేతలే విజయం దక్కించుకున్న నేపథ్యంలో కార్పొరేటర్లు, మేయర్లు, వార్డు మెంబర్లకు పార్టీ బాధ్యతలను అప్పగించనుంది. దీనికి సంబంధించి.. పక్కా వ్యూహంతో ముందుకు సాగనుంది. ఇలా.. పట్టణాలు, నగరాల్లో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కూడా తగ్గించుకుని ఎన్నికల నాటికి.. పార్టీని విజయపథంలో ముందుకు సాగించేలా ప్లాన్ చేయడం గమనార్హం.