రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా ముందు గొప్పలు పోవడం అందరూ చేసేదే. హిట్ అయితే పర్లేదు. ఏదైనా తేడా కొడితే జనాలు నవ్వుకునేలా ఉంటాయి ఆ వీడియోలు. మొన్న శుక్రవారం విడుదలైన ఆంధ్రకింగ్ తాలూకా మాత్రం అక్కర్లేని భేషజాలకు పోకుండా గ్రౌండ్ రియాలిటీలోనే ఉంది. ఈ విషయం తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో బయట పడింది. ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్లిన రామ్ హైదరాబాద్ తిరిగి రాగానే మీడియా ప్రతినిధులను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా టీమ్ చాలా విషయాలే పంచుకుంది.

వాటిలో ముఖ్యమైంది మొదటి వారం కలెక్షన్లు ఇలా కొంచెం తక్కువగానే ఉంటాయని ముందే ఊహించామని రామ్ చెప్పడం. నెంబర్ల కోసం వెంపర్లాడకుండా, కంటెంట్ జనాలకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో డ్రై సీజన్ లాంటి నవంబర్ ను ఎంచుకున్నామని, టికెట్ రేట్లు పెంచకుండా తీసుకున్న నిర్ణయం అందులో భాగమేనని వివరించాడు. గతంలో ఇదే నెలలో వెంకటేష్ తో కలిసి చేసిన మసాలాకు ఓపెనింగ్స్ చాలా డల్లుగా వచ్చాయని, కానీ ఆంధ్రకింగ్ తాలూకా విషయంలో అలాంటి భయాలేవీ పెట్టుకోకపోవడం వల్ల ముందడుగు వేశామని అన్నారు. రామ్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడ్డం విశేషం.

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న టిఎఫ్ఐ ఫెయిల్డ్ గురించి రామ్ చాలా స్పష్టంగా అలాంటిదేమీ లేదని, ఆడియన్స్ ఎప్పుడూ ప్రేమని కురిపిస్తూనే ఉంటారని, ట్యాగులు గట్రా నేను నమ్మనని చెప్పిన మాట బాగుంది. సినిమా బాలేకపోతే రుద్దనని చెప్పడం ఆకట్టుకుంది. నిర్మాత రవిశంకర్ టాక్ తో పోలిస్తే వసూళ్లు తక్కువ ఉన్న మాట వాస్తవమేనని, ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఆదరించమని కోరారు. ఇలాంటివి ఆడకపోతే మళ్ళీ రొటీన్ మసాలాలకు వెళ్లిపోవాల్సి వస్తుందనే హింట్ కూడా ఇచ్చారు. ఏదేమైనా క్షేత్ర స్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాలూకా బృందం మాట్లాడింది.