తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేశాయి. ఈ క్రమంలోనే అవి రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా పవన్ క్యాజువల్ గా చేసిన వ్యాఖ్యలని, వాటిపై అనవసర రాద్ధాంతం అక్కర లేదని జనసేన ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

అయినా సరే కొందరు తెలంగాణ నేతలు మాత్రం పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని అంటున్నారు. ఇక, తాజాగా ఆ జాబితాకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తోడయ్యారు.

పవన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టొద్దని, మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం సరికాదని షర్మిల హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అని చెప్పడం సరికాదన్నారు. ఉప్పు నీటి వల్ల కొబ్బరి చెట్లు కూలాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించాలని కోరారు. మరి, షర్మిల వ్యాఖ్యలపై పవన్, జనసేనల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.