ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల క్రితం రాష్ట్రంలోనే అత్యధిక ఎయిడ్స్ కేసులు నమోదయ్యేవని తెలిపారు.
ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన పెంచడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న గత పాలనా కాలంలో తీసుకున్న విప్లవాత్మక చర్యలను చంద్రబాబు వివరించారు. ఆ కాలంలో తాను అసెంబ్లీలో కండోమ్‌లతో డెకరేషన్ చేయించి, సభ్యులకు, రాష్ట్ర ప్రజలలో దీని గురించి అవగాహన కల్పించామన్నారు. 2030 నాటికి రాష్ట్రాన్ని ఎయిడ్స్ కేసులు లేని రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఏపీలో హెచ్‌ఐవి పాజిటివిటీ రేటు 2015–16లో 2.34 శాతం నుంచి 2024–25లో 0.58 శాతానికి తగ్గింది. నిరంతర అవగాహన ప్రచారాలు, సురక్షిత లైంగిక పద్ధతుల ప్రచారం, ఉచిత చికిత్స సౌకర్యాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
2010తో పోలిస్తే 2024–25 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ సంబంధిత మరణాలు 88.72 శాతం తగ్గాయి. గర్భిణీ స్త్రీలలో హెచ్‌ఐవీ పాజిటివిటీ రేటు 2015–16లో 0.10 శాతం నుంచి 2024–25లో 0.04 శాతానికి తగ్గింది. ఈ వివరాలను వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates