ఏపీ అధికార పార్టీ వైసీపీ అంటే.. కొన్నాళ్లుగా కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకమనే టాక్ ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో కమ్మలను టార్గెట్ చేస్తూ.. వైసీపీ నాయకులు అనేక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సీఎం జగన్ స్వయంగా అప్పటి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కూడా కమ్మ సామాజిక వర్గం పేరును అంటగడుతూ.. తీవ్రవిమర్శలు గుప్పించారు. స్థానికలను కరోనా కారణంగా నిలిపివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇక, ఆ తర్వాత రాజధాని వివాదం మరో మలుపు తిరిగి.. చాలా కాలం పాటు కమ్మ వర్గంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
ఇలాంటి వైసీపీలో అదే కమ్మ సామాజిక వర్గం నేత కోసం.. సీఎం జగన్ సామాజిక వర్గం రెడ్లు రోడ్డెక్కారు. ఇదే ఇప్పుడు వైసీపీ లో ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుతం వైసీపీలో ఎన్నికలకు సంబంధించిన మార్పులు, చేర్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. సర్వేలు.. ప్రజాభిప్రాయం పేరుతో వైసీపీ అనేక మంది నాయకులను తప్పిస్తున్న విషయం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసారావు పేట నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలును కూడా మార్పునకు సంబంధించి పార్టీ ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసిందే.
ఆయనకు వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట టికెట్ లేదని, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారని పార్టీలో చర్చ సాగుతోంది. వార్తల రూపంలోనూ బయటకు వచ్చింది. అయితే.. తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని.. ఇస్తే నరసరావుపేట.. లేకపోతే.. లేదని ఎంపీ లావు తేల్చి చెప్పారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు లావుకు మద్దతు తెలుపుతున్నారు. ఆయనకే టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయినా.. అధిష్టానం మాత్రం సర్వేలనే నమ్ముతోంది.
ఈ క్రమంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావుకే.. నరసారావుపేట టికెట్ ఇవ్వాలంటూ.. ఇదే నియోజకవర్గానికి చెందిన రెడ్డి నాయకులు.. తాజాగా రోడ్డెక్కారు. పేట లోక్‌సభ వైసీపీ కన్వీనర్ ఏరువ విజయభాస్కరరెడ్డి నేతృత్వంలో రెడ్డి నాయకులు ఓబుల్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, బ్రహ్మారెడ్డి, నరసారెడ్డి, నాగుల రెడ్డి తదితర కీలకరెడ్డి నాయకులు లావుకే టికెట్ ఇవ్వాలంటూ.. ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. తాజాగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొని ఎంపీ లావుకు మద్దతు తెలిపారు. స్థానికంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేశారని, ఆయనకు టికెట్ ఇస్తే.. గెలుపు ఖాయమని వారు చెప్పడం గమనార్హం. మొత్తానికి కమ్మ నేత కోసం.. రెడ్ల ఉద్యమం.. వైసీపీలో షాకింగ్ సీన్‌నే తలపించింది.