టీడీపీ అధినేత చంద్రబాబు కోసం.. యాగాలు.. యజ్ఞాలు తెరమీదికి వస్తున్నాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలన్న లక్ష్యంతో గన్నవరం టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు.. యాగం తలపెట్టారు. దీనిని ఆయన తన సతీసమేతంగా ప్రారంభించారు కూడా. యాగాలలో కెల్లా శ్రేష్టమైనది.. కార్యం తలపెట్టిన వెంటనే సాకారం చేసుకోగలిగిందిగా పేరున్న శత చండీ యాగాన్ని యార్లగడ్డ నిర్వహిస్తున్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని తన వ్యవసాయ క్షేత్రంలో యార్లగడ్డ ఈ యాగానికి శ్రీకారం చుట్టారు. 30 మంది వేద పండితులతో(తిరుమల, శ్రీకాళహస్తి, అన్నవరం నుంచి వచ్చారట) మూడు రోజులు పాటు యాగం జరగనుందని.. యార్లగడ్డ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలన్న కోరికతోనే ఈ యాగానికి శ్రీకారం చుట్టినట్టు వెంకట్రావు పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీపై దేవుని ఆశీస్సులు కోరుకుంటున్నట్టు చెప్పారు.
మరో మూడు మాసాల్లో అమరావతి వేదికగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని వెంకట్రావు అన్నారు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గానికి పూర్వవైభవం రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే.. గత 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విజయవాడ కు చెందిన కీలక నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు రాధా కూడా.. చంద్రబాబు విజయం కాంక్షిస్తూ.. శతచండీయాగమే నిర్వహించడం గమనార్హం.
వంగవీటి రాధా మాతృమూర్తితో కలిసి విజయవాడలోని స్వగృహంలో రాధా అప్పట్లో యాగం చేశారు. కాగా, ఇప్పుడు యాగం చేస్తున్న యార్లగడ్డ కూడా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నాయకుడే కావడం విశేషం. మరి రాధా యాగం మాట ఎలా ఉన్నా.. యార్లగడ్డ యాగం ఫలించాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. కొన్నిరోజుల కిందట ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనూ యాగాలు, యజ్ఞాలు జరిగిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates