వైసీపీకి గుడ్ బై.. రాయుడి రీజ‌న్ ఇదే!

వైసీపీలో ఇలా చేరి అలా బ‌య‌ట‌కు వ‌చ్చిన భార‌త మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు త‌న నిష్క్ర‌మ‌ణ‌కు సంబంధించిన కార‌ణాన్ని వెల్ల‌డించారు. తిరిగి తాను క్రికెట‌ర్‌గా అరంగేట్రం చేయ‌నున్నాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ నెల 20 నుంచి దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఐఎల్‌టీ 20లో తాను ఆడ‌నున్న‌ట్టు చెప్పారు. ప్రొఫెష‌న‌ల్ క్రికెట్ ఆడేవారికి రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధం ఉండ‌రాద‌నే నిబంధ‌న ఉంద‌ని.. అందుకే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు తాజాగా ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. అంబ‌టి రాయుడు వైసీపీలో చేర‌డం.. ఆ వెంట‌నే ఆరు రోజుల‌కే ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌హా వైసీపీ రెబ‌ల్ నాయ‌కులు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ నైజం న‌చ్చ‌కే.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని వ్యాఖ్యానించారు. ఆరు రోజుల్లోనే పార్టీ ప‌రిస్థితి ఆయ‌న‌కు అర్థ‌మైంద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించారు. అంబ‌టికి.. వైసీపీకి పొస‌గ‌ద‌ని, ఆయ‌న సౌమ్యుడ‌ని.. కానీ, వైసీపీలో క‌ఠినంగా ఉండే నాయ‌కుల‌కే చోటు ఉంటుంద‌ని.. అందుకే ఆయ‌న త‌ప్పుకొన్నార‌ని కూడా విశ్లేషించారు.

ఇక‌, మ‌రికొంద‌రు.. అంబ‌టి రాయుడు గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావించార‌ని చెప్పారు. అయితే.. దీనికి వైసీపీ అధిష్టానం అంగీక‌రించ‌లేద‌ని.. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని విశ్లేషించారు. అంబ‌టి రాయుడును మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఒత్తిడి చేశార‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇంత‌గా రాజ‌కీయ విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వైసీపీ నాయ‌కులు సంయ‌మ‌నం పాటించారు. ఎవ‌రూ ఎక్క‌డా రాయుడి గురించి ప‌న్నెత్తు మాట అన‌లేదు. ఇంత‌లోనే రాయుడు త‌న నిష్క్ర‌మ‌ణ‌కు సంబంధించిన కార‌ణాలు వెల్ల‌డించ‌డంతో ఈ వివాదం టీ క‌ప్పులో తుఫాను మాదిరిగా చ‌ల్లారిపోయింది.