కోదండరామ్ కు కన్ఫర్మ్ అయ్యిందా ?

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. దేనికంటే తొందరలోనే భర్తీ అవబోయే రెండు ఎంఎల్సీ స్ధానాలకోసం. ఈనెలాఖరులో ఎంఎల్ఏ కోటాలో ఖాళీ అయిన రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీకోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిపికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమీషన్ జారిచేసిన నోటిఫికేషన్ ప్రకారం రెండుస్ధానాలూ కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయి. అందుకనే ఇంత ఒత్తిడి పెరిగిపోతోంది. కొందరు నేతలు రేవంత్ రెడ్డిపైన మరికొందరు నేతలు డైరెక్టుగా ఢిల్లీలోని అగ్రనేతల దగ్గర ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

తాజాగా ఓ చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతు ప్రొఫెసర్ కోదండరామ్ కు ఒక స్ధానాన్ని రిజర్వుచేసినట్లు చెప్పారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ అవకాశం ఇస్తామని గతంలోనే ప్రొఫెసర్ కు హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తుచేసుకున్నారు. కాబట్టి రేవంత్ వ్యాఖ్యలతో కోదండరామ్ కు ఒక సీటు రిజర్వ్ అయిపోనట్లు అర్ధమవుతోంది. అందుకనే మిగిలిన ఒక్కసీటు కోసం పార్టీలో నేతల ప్రయత్నాలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే నామినేషన్  వేసేంతవరకు ప్రొఫెసర్ కు సీటు గ్యారెంటీలేదు. కాంగ్రెస్ లో వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి.

అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ అధిష్టానమే మార్చుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇపుడు ప్రొఫెసర్ కు కూడా అలాగే జరుగుతుందని అనుకునేందుకు లేదు. కాకపోతే ప్రొఫెసర్ ఎన్నిక సాఫీగా సాగిపోతుందని ధీమాగా ఉండేందుకూ లేదు. రేవంత్ నిర్ణయాలు అధిష్టానం ముందు పనికిరాకుండా పోయినా ఆశ్చర్యంలేదు.

ఏదేమైనా రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రొఫెసర్ కు ఇచ్చిన హామీని అధిష్టానం నిలబెట్టుకుంటుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే తొందరలోనే మరో నాలుగు ఎంఎల్సీ స్ధానాలను భర్తీ చేయాల్సుంటుంది. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను గెలవాలంటే కాంగ్రెస్ మాట మీద నిలబడుతుందనే నమ్మకాన్ని నేతలు, జనాల్లో కలిగించటం చాలా అవసరం. కాబట్టి ఇపుడు ప్రొఫెసర్ కు ఒక ఎంఎల్సీ స్ధానాన్ని కేటాయించేస్తే పార్టీకి బాగా మైలేజి పెరుగుతుంది.  అందుకోసమన్నా ప్రొఫెసర్ కు ఎంఎల్సీ గ్యారెంటీ అనుకోవచ్చు.