విజయవాడ తూర్పు నియోజకవర్గం రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అయితే.. ఈ సారి మరింతగా వేడెక్కాయని తెలుస్తోంది. దీనికి కారణం.. టీడీపీ తర ఫున మరోసారి గద్దె రామ్మోహన్‌కే టికెట్ ఇచ్చేందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, ఈ విషయం కన్ఫర్మ్ కావడంతో.. గద్దె తన అనుచరులతో పర్యటనలు ప్రారంభించారు. ప్రజలను కలుస్తున్నారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే ఇప్పటి వరకు దేవినేని అవినాష్‌ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చెబుతూ వచ్చిన అధిష్టానం అనూహ్యంగా నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భానును ఇక్కడకు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీలోనూ ఇదే విషయం చర్చగా మారింది. జగ్గయ్య పేట నియోజకవర్గం నుంచి సామినేనిని ఇక్కడకు తీసుకువచ్చి.. అవినాష్‌ను వేరే నియోజకవర్గానికి పంపిస్తారనేది ప్రధాన విషయం.
ఒకవేళ సామినేని వచ్చేందుకు అంగీకరించని పక్షంలో యలమంచిలి రవికి ప్రాధాన్యం దక్కుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే యలమంచిలి ప్రొఫైల్‌ను పార్టీ అధినేత జగన్ తీసుకున్నారని.. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎలా చూసుకున్నా.. గద్దె వంటి బలమైన నాయకుడిని ఓడించాలనేది ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న కీలక టార్గెట్. ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు.
ఇక, గత రెండు ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్న గద్దె.. కూడా ఇక్కడ బలంగానే ఉన్నారు. అయితే, అంతర్గత సమస్యలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. విజయవాడ ఎంపీ నుంచి సహకారం లేకపోవడం.. సొంత పార్టీ నాయకులు కూడా ఇప్పుడు దూరంగా ఉండడం.. వంటివి గద్దె కు సవాల్‌గా మారాయి. అయితే, ఆయన సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న నేపథ్యంలో మూడో సారి కూడా వరుసగా ఆయన గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని పార్టీ భావిస్తోంది. కానీ, పోరు మాత్రం తీవ్రంగానే ఉంటుందని పార్టీ అంచనా వేస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates