రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం ?

బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదోపిడీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడచిన ఐదేళ్ళల్లో 2018-23 మధ్య కేసీయార్ హయాంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి అండ్ కో చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క రేవంత్ అండ్ కో మాత్రమే కాదు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కూడా ఇవే ఆరోపణలు చేశాయి. అధికారంలోకి రాగానే భూదోపిడీపై విచారణ చేయిస్తామని అప్పట్లోనే రేవంత్ పదేపదే ప్రకటించారు.

అప్పుడు చేసిన ప్రకటనకు ఇపుడు కార్యరూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజి కి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. గడచిన ఐదేళ్ళల్లో భూములు రిజిస్ట్రేషన్లు చేసుకున్న అధికారపార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు, ముఖ్యనేతల బినామీలుగా ప్రచారంలో ఉన్న వ్యక్తులతో పాటు రియల్ ఎస్టేట్ సంస్ధలపై పూర్తి వివరాలు అందచేయాలని చెప్పారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు వివిధ జిల్లాల హెడ్ క్వార్టర్స్ తో పాటు డిమాండున్న ప్రాంతాల్లోని భూములపై జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించి తనకు ఇవ్వాలని చెప్పారట.

రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారి వివరాలను, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ను కూడా విచారించి తనకు నివేదిక ఇవ్వమని చెప్పారట. కాంగ్రెస్ ఆరోపణ ప్రకారం కేసీయార్ హయాంలో సుమారు 10 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయలుంటాయని అంచనా. అనుమానంగా ఉన్న లావాదేవీలపై లోతుగా విచారణ జరిపి తన నివేదికను ఇవ్వమని రేవంత్ ఆదేశించారట.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ జిల్లాల రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు వెంటనే అవసరమైన ఆదేశాలను జారీచేశారట. మొత్తం పదిరోజుల్లో అవసరమైన వివరాలను సేకరించి, విచారణ జరిపింది నివేదికను తయారుచేసే పనిలో డీఐజీ ఆఫీసు బిజీ అయిపోయింది. అన్నీ వివరాలు అందుబాటులోకి వస్తే భూదోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, వాళ్ళ బినామీల వివరాలన్నీ బయటపడతాయని రేవంత్ అనుకుంటున్నారు. మరి చివరకు ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో చూడాలి.