ఉమ్మడి కృష్నాజిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో పామర్రు కీలకమైంది. ఈ నియోజకవర్గం టికెట్ విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ క్లారిటీతోనే ఉంది. పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాకు ఇక్కడి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు. వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక, అధికార పార్టీ విషయానికి వస్తే మాత్రమే కొంత సందేహాలు.. మరిన్ని అనుమానాలు ఇంకొన్ని కొర్రీలు కనిపిస్తున్నాయి.
2019 ఎన్నికలలో కైలే అనిల్‌కుమార్ వైసీపీ తరఫున పామర్రు నుంచి విజయం దక్కించుకున్నారు. ఈయన గుడివాడ ఎమ్మెల్యే, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకు న్నారు. దాదాపు పేరుకు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమారే అయినా.. పామర్రు వైసీపీలో తెరచాటున చక్రం తిప్పుతోంది కొడాలి నాని వర్గమే అన్నది బహిరంగ రహస్యం. ఈ దఫా కైలేకు టికెట్ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ కూడా అంతర్మథనంలో ఉంది.
ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణాలోని విజయవాడ నగరం వరకు మాత్రమే చర్చలు.. అభ్యర్థుల మార్పులకు వైసీపీ పరిమితమైనా.. జిల్లాలోని నియోజకవర్గాల విషయాన్ని మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ఈ క్రమంలో తాజాగా కొందరు పామర్రు నాయకులు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి.. పామర్రులో ఈ సారి బలమైన నాయకుడికి టికెట్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కైలేను నియోజకవర్గంలో సగానికి మందికి పైగా ప్రజలు గుర్తించడమే లేదని.. ఆయన బయటకు కూడా రావడం లేదని ఫిర్యాదులు చేశారు.
గతంలో జరిగిన రెండు మూడు ఘటనల తాలూకు వీడియోలు, ఫొటోలను కూడా సలహాదారుకు చూపిం చారని తెలిసింది. మరోవైపు.. పార్టీ కూడా కైలే దూకుడు లేని నాయకుడిగా ముద్ర వేసినట్టు ఆయన అనుచరులే చెబుతున్నారు. రాజకీయాల్లో ఆయన మెత్తగా ఉండడం.. విపక్షాన్ని టార్గెట్ చేయకపోవడం.. కొందరు స్థానిక నేతలతో ఆయన మిలాఖత్ కావడం.. వంటివాటిని కూడా పార్టీ పరిశీలన చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఉప్పులేటి కల్పనను పార్టీలోకి ఆహ్వానించి.. ఆమెకు టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో వర్గం చెబుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates