ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ శుక్రవారం నుంచి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే.. రా.. కదలిరా! పేరుతో నిర్వహించే బహిరంగ సభలు. సమావేశాలు. నాయకుల చేరికలు.. ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం. 1982-83 మధ్య కాలంలో దివంగత ఎన్టీఆర్.. టీడీపీని స్థాపించారు. ఈ సమ యంలో ఆయన చైతన్య రథంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఆయన రా.. కదలిరా! నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లారు.
అప్పట్లో అది నినాదం మాత్రమే. కానీ, అదే నినాదాన్ని ఇప్పుడు టీడీపీ కార్యక్రమం రూపంలో మలిచి ప్రజలకు చేరువ అయ్యేందుకు రెడీ అయింది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.. పార్టీని మరింతగా ప్రజల కు చేరువ చేయడం.. అదేసమయంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు పార్టీ ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు గత చంద్రబాబు హయాంలో చేపట్టిన కార్యక్రమాలను వారికి చెప్పి.. మరోసారి టీడీపీకి అనుకూలం గా మార్చాలనేది ప్రధాన సంకల్పం.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల పాటు ఉదయం, సాయంత్రం కూడా భారీ బహిరంగ సభలను నిర్వహించి.. జన సమీకరణ చేయడం ద్వారా పార్టీని మరోసా రి అధికారంలోకి తీసుకురావాలనేది టీడీపీ వ్యూహం. దీనికి సంబంధించి పక్కా కార్యాచరణను పార్టీ నిర్దేశించుకుంది. ఇంత వరకు లక్ష్యం బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని చిన్నపాటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాయకుల్లో నియోజకవర్గాల కేటాయింపు తర్జన భర్జనగా ఉంది.
కోరుకున్న సీటు దక్కుతుందా? లేదా? అనే సమస్య ఆలోచన దాదాపు 60 నుంచి 70 మంది నాయకులకు ఉంది. దీంతో వారంతా పార్టీకి అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చం ద్రబాబు పర్యటిస్తున్నా.. నారా లోకేష్ కార్యక్రమాలకు హాజరవుతున్నా.. వీరిలో చాలా మంది కడు దూరం లో ఉంటున్నారు. కొందరు రెండేసి టికెట్లు ఆశిస్తున్నారు. మరికొందరు తమ వారసులను రంగం లోకి దింపాలని అనుకుంటున్నారు.
ఇంకొన్ని స్థానాల్లో తమను మారుస్తారా? లేక పొత్తులో ఉన్న పార్టీకి టికెట్ ఇచ్చేస్తారా? అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ విషయాన్ని తేల్చకుండా.. ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించ డం ద్వారా పార్టీకి ఎంత వరకు లక్ష్య సాధాన సాధ్యమవుతుందనేది ప్రదాన ప్రశ్నగా మారింది. ముందుగా నాయకులతో చర్చించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అసంతృప్తులను సరిచేయడం ద్వారానే రా.. కదలిరా! కార్యక్రమం మరింత విజయవంతం అవుతుందనేది మెజారిటీ నేతల సూచనగా మారింది. మరి ఏం చేస్తారో చూడాలి.